కర్ణాటకలోని బెంగళూరులో ఓ కాలేజీ విద్యార్థిని కిడ్నాప్ చేసి నిప్పంటించారు దుండగులు. చేతులు, కాళ్లు కట్టేసినా.. బాధితుడు వారి బారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ నివాసి అయిన శశాంక్ అనే విద్యార్థి.. స్థానికంగా ఓ కళాశాలలో చదువుతున్నాడు. మైసూర్లో ఉంటున్న దూరపు బంధువైన ఓ అమ్మాయిని అతడు గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. వారి ప్రేమను ఇరువురి తల్లిదండ్రులు వ్యతిరేకించారు. అయితే జులైన 3వ తేదీన బెంగళూరుకు వచ్చిన ఆ అమ్మాయిని శశాంక్ తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు.. శశాంక్ ఇంటికి జులై 10న వెళ్లారు. శశాంక్‌పై దాడి చేసి అమ్మాయిను తమ వెంట తీసుకెళ్లిపోయారు.
అయితే శనివారం ఉదయం శశాంక్‌ను అతడి తండ్రి రంగనాథ్.. తన బైక్‌పై కళాశాల వద్ద దింపాడు. అదే రోజు సాయంత్రం కాలేజీ అయ్యాక.. బస్సు కోసం బాధితుడు రోడ్డు మీద ఎదురుచూస్తున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా వచ్చిన కొందరు వ్యక్తులు.. శశాంక్‌ను కిడ్నాప్ చేశారు. అనంతరం కాళ్లు, చేతులు కట్టేశారు. యాసిడ్ లాంటి మండే పదార్థాలను అతడిపై పోసి సజీవదహనం చేసేందుకు యత్నించారు.
అప్రమత్తమైన శశాంక్.. ఎలాగోలా మంటలను ఆర్పివేశాడు. స్థానికుల సహాయంతో ఇంటికి చేరుకున్నాడు. శరీరమంతా తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న శశాంక్‌ను అతడి కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై శశాంక్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మార్నింగ్ వాక్కు వెళ్లి.. మృత్యుఒడిలోకి..
లారీకి ఉండే తాడు.. కాలులో చిక్కుకుని మార్నింగ్ వాక్కు వెళ్లిన ఓ వ్యక్తి రోడ్డు మీదే మరణించాడు. దీంతో అతడి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. కేరళలోని కొట్టాయం జిల్లాలో ఈ ఘటన జరిగింది.