Collector Transfer On Politician Complaint :స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు దాటుతున్నా.. ఆ గ్రామానికి ఇప్పటికి తాగునీటి సదుపాయం లేదు. మూడు రోజులకొకసారి ట్యాంకర్లతో వచ్చిన నీటినే పట్టుకుని నిల్వ చేసుకుంటారు. ఆ నీటినే తాగడానికి, వంటకు వినియోగిస్తారు. అది కూడా ఒక మనిషికి 15 లీటర్లు మాత్రమే. ఆ నీరు అయిపోతే కి.మీ మేర నడిచి పక్క గ్రామాలకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిందే. ఆ గ్రామమే ఉత్తర్ప్రదేశ్.. మీర్జాపుర్ జిల్లాలోని లహురియాదహ్. వీరి కష్టాలను చూసి స్పందించిన మీర్జాపుర్ కలెక్టర్ దివ్యా మిత్తల్.. ఇంటింటికి తాగునీరు అందించే పథకం 'జల్ జీవన్ మిషన్' కింద ఆగస్టు 29న కుళాయిలు వేయించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ జరిగింది.
అప్పుడేం జరిగిందంటే?
లహురియాదహ్ గ్రామానికి కుళాయిల ద్వారా తాగు నీరు అందించిన మూడు రోజుల్లోనే మీర్జాపుర్ కలెక్టర్ దివ్యా మిత్తల్ వేరే ప్రదేశానికి బదిలీ అయ్యారు. మరోవైపు కుళాయిల పైపులను గుర్తు తెలియని వ్యక్తులు కట్ చేశారు. దీంతో లహురియాదహ్ గ్రామానికి మళ్లీ నీటి కష్టాలు మొదలయ్యాయి. ట్యాంకర్లలో వచ్చిన నీటిని పట్టుకుని నిల్వ చేసుకుంటున్నారు. గ్రామంలో చాలా కాలంగా నీటి ఎద్దడి ఉందని లహురియాదిహ్ గ్రామస్థులు చెబుతున్నారు. తమకు తాగునీటిని అందించిన కలెక్టర్ హఠాత్తుగా బదిలీ కావడంపై గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక తమ తాగు నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.