తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అప్పుడు రూల్స్ బ్రేక్.. 3 నెలలకే ప్రమాదం.. 10 మంది మృతి.. సీఎం సీరియస్! - పైకప్పు కూలిన యూపీ కోల్డ్​ స్టోరేజ్​

దాదాపు మూడు నెలల క్రితం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఓ కోల్డ్​ స్టోరేజ్​ పైకప్పు కూలి 10 మంది మృతిచెందగా.. 11 మంది గాయపడ్డారు. ఈ శిథిలాల కింద చిక్కుకున్న మరింత మందిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి మృతులకు, గాయపడిన వారికి పరిహారం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

cold storage accident
cold storage accident

By

Published : Mar 17, 2023, 2:36 PM IST

Updated : Mar 17, 2023, 3:49 PM IST

భవనం పైకప్పు కూలి 10 మంది మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కోల్డ్​ స్టోరేజ్​ పైకప్పు కూలి 10 మంది మృతి చెందగా.. మరో 11 మంది గాయపడ్డారు. గురువారం ఈ ప్రమాదం జరగ్గా సహాయక చర్యలు చేపడుతున్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నందున.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. పైకప్పు కూలడానికి గల కారణాలను తెలుకునేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. మృతులు కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50,000 పరిహారం ప్రకటించారు సీఎం యోగి.

సంభాల్​ జిల్లాలోని చందౌసీ ప్రాంతంలో ఉన్న కోల్డ్ స్టోరేజ్​లో బంగాళాదుంపలను నిల్వచేస్తారు. అయితే గురువారం ఆ కోల్డ్​ స్టోరేజ్​ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో స్టోరేజ్​ లోపల చాలా మంది ఉన్నారు. వారంతా శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​ దళాలు హుటాహుటిన అక్కడకు చేరుకున్నాయి. జేసీబీల సహాయంతో శిథిలాలను తొలగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. శుక్రవారం ఉదయం నాటికి 21 మందిని శిథిలాల నుంచి సహాయక సిబ్బంది బయటకు తీశారు. వీరిలో 10 మంది మృతి చెందగా, మిగిలిన వారు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

కూలిపోయిన ఈ పైకప్పు మూడు నెలల క్రితమే నిర్మించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వం నుంచి ఏ అనుమతి లేకుండా దీన్ని నిర్మించారని డీఐజీ మాథుర్ తెలిపారు. ప్రస్తుతం ఈ కోల్డ్ ​స్టోరేజ్​లో దాని సామర్థ్యానికి మించి బంగాళాదుంపలు నిల్వ చేసినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కోల్డ్​ స్టోరేజ్​లో బంగాళాదుంపలతో పాటుగా అమోనియా గ్యాస్​ సిలిండర్లు కూడా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకుని సహాయక చర్యలు చేపడుతున్నట్లు డీఐజీ వెల్లడించారు. కోల్డ్ స్టోరేజీ యజమానులైన అంకుర్ అగర్వాల్, రోహిత్ అగర్వాల్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు డీఐజీ తెలిపారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు

ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి వెంటనే ఉచిత వైద్య సహాయం అందించాలని సంబంధిత అధికారులను అదేశించారు. మృతుల కుటుంబాలు ఒకొక్కరికి 2 లక్షలు రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50,000 పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు సత్వరమే తెలుసుకునేందుకు డీఐజీ అధ్యక్షతన ఓ ప్రత్యేక​ కమిటీని ఏర్పాటుచేశారు. విద్యా శాఖ సహాయ మంత్రి గులాబ్​ దేవి, పంచాయతీ రాజ్​ శాఖ సహాయ మంత్రి ధరమ్​పాల్​ సింగ్​ ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం జాగిలాల సహాయంతో గాలిస్తున్నామని.. శిథిలాలు పూర్తిగా తొలగించిన తర్వాతే ప్రమాదానికి గల కారణాలు వెల్లడించగలమని డీఐజీ మాథుర్ తెలిపారు.

Last Updated : Mar 17, 2023, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details