coal lorry hit a TSRTC bus: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న టీఎస్‌ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో 43 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం భద్రాచలం డిపో నుంచి 47 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు విజయవాడ బయల్దేరింది. చుంచుపల్లి మండలం ఆనందగని వద్ద వేగంగా వస్తోన్న బొగ్గు లారీ బస్సును ఢీ కొట్టింది.
దీంతో బస్సు రెండు పల్టీలు కొట్టి బోల్తాపడింది. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కొత్తగూడెంలోని జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో విజయవాడ, నూజివీడు, భద్రాచలం, కొత్తగూడెం పట్టణాలకు చెందిన వారు ఉన్నారు.