దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత ఏర్పడడంతో విద్యుత్ సంక్షోభం (Power crisis in India) ఎదుర్కోబోతున్నట్లు వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. విద్యుత్ సంక్షోభంపై(Power crisis in India) అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని స్పష్టం చేసింది. కేవలం గెయిల్ (GAIL), డిస్కం సంస్థల మధ్య సమాచారలోపం వల్లే ఇలాంటివి ఏర్పడినట్లు పేర్కొంది. దేశరాజధాని దిల్లీ, మరికొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాకు ప్రమాదం ఏర్పడనున్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్(RK singh news) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈటీవీ భారత్‌తో ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలే వదంతులు సృష్టిస్తూ.. రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
'విద్యుత్ సంక్షోభం(Power crisis in India) ఎదుర్కోబోతున్నట్లు అనవసర భయాందోళనలు సృష్టించారు. దేశంలో నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. మరోవైపు ఎట్టిపరిస్థితుల్లోనూ గ్యాస్ సరఫరా కూడా తగ్గదు. విద్యుత్ అవసరమైన వారు కోరితే వారికి సరఫరా చేస్తాం' అని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్(RK singh news) వెల్లడించారు. దేశంలో విద్యుత్ సంక్షోభానికి కారణమయ్యే సరఫరా, వినియోగం మధ్య ఎలాంటి అగాధం లేదని స్పష్టం చేశారు. విద్యుత్ కేంద్రాలకు అవసరమైన గ్యాస్ అందించాలని ఇప్పటికే గెయిల్ సీఎండీకి ఆదేశించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఎన్‌టీపీపీ, బీఎస్‌ఈఎస్‌లతో పాటు విద్యుత్ మంత్రిత్వశాఖ అధికారులతో ఆయన నివాసంలో సమావేశమైన అనంతరం ఆర్‌కే సింగ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందంటూ వినియోగదారులకు సమాచారాన్ని పంపడం పట్ల కొన్ని సంస్థలను హెచ్చరించినట్లు కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్ పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ సంస్థ గెయిల్ కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం పట్ల వారిని కూడా మందలించినట్లు సమాచారం.