దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం వినియోగిస్తున్న 'కొవిన్' పోర్టల్‌లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్నారా? లేదా? సులభంగా తెలుసుకునేందుకు 'నో యువర్ కస్టమర్/క్లయింట్ వ్యాక్సినేషన్ స్టేటస్' పేరుతో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్(ఏపీఐ)ను తీసుకొచ్చినట్లు కేంద్రం ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
సులభంగా గుర్తించండిలా..
టీకా తీసుకున్నట్లు ఆధారం చూపేందుకు డిజిటల్ సర్టిఫికెట్‌కు ఇప్పటికే కొవిన్ యాప్‌లో అందుబాటులో ఉంది. అయితే ప్రతిసారీ ఇలా వ్యాక్సిన్ ధ్రువపత్రాలను పరిశీలించకుండా.. సులభంగా వ్యాక్సినేషన్ స్టేటస్‌ను తెలసుకునేందకు కొత్త ఏపీఐ ఉపయోగపడుతుందని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ విధానం వల్ల ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల వ్యాక్సినేషన్ స్టేటస్‌నూ.. అధికారులు సులభంగా గుర్తించవచ్చని తెలిపింది.
ఈ ఏపీఐ ఎలా ఉపయోగించాలి..?
ఈ ఏపీఐను ఉపయోగించాలంటే.. సదరు వ్యక్తి తన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. అప్పుడు ఆ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే..
మూడు రకాలుగా కొవిడ్ వ్యాక్సినేషన్ స్టేటస్ డిస్ప్లే అవుతుంది.
- వ్యక్తి వ్యాక్సిన్ తీసుకోలేదు
- వ్యక్తి వ్యాక్సిన్ ఒక్క డోస్ తీసుకున్నారు.
- వ్యక్తి పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నారు.
ఈ సమాచారాన్ని ఎవరికైనా షేర్ చేసుకోవచ్చని మంత్రిత్వశాఖ వెల్లడించింది. వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం కలగదని భరోసా ఇచ్చింది. ఈ విధానాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ అని తేడాలేకుండా ఏ సంస్థ అయినా ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఏపీఐ ద్వారా కొవిడ్ వ్యాక్సినేషన్ సమాచారాన్ని అందించేందుకు ఓ వెబ్‌పేజీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైనప్పటినుంచి.. ఇప్పటివరకు 72 కోట్లకుపైగా కొవిడ్ టీకా డోసులను పంపిణీ చేశారు.
ఇదీ చదవండి:Covishield Vaccine: 66 కోట్ల డోసుల కొవిషీల్డ్ కోసం ఆర్డర్లు