తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యాక్సినేషన్‌ కేంద్రాలను గుర్తించేందుకు ప్రత్యేక 'మ్యాప్‌లు'

కొవిడ్​ వ్యాక్సిన్​ కేంద్రాలకు ప్రజలు మరింత సులువుగా చేరుకునేలా 'మ్యాప్‌ మై ఇండియా' సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. సమీప ప్రాంతాల్లోని వ్యాక్సినేషన్‌ కేంద్రాలను గుర్తించేందుకు మ్యాప్​లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆ సంస్థ సీఈవో రోహన్‌ వర్మ తెలిపారు. మ్యాప్‌ సాయంతో సులువుగా కేంద్రానికి చేరుకోవచ్చని వెల్లడించారు. కొవిన్​ పోర్టల్​లో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 10 లక్షల మందికిపైగా పేర్లను నమోదు చేసుకున్నారని కేంద్రం తెలిపింది.

Co-WIN app meant only for administrators, vaccine registration to be done through portal: Govt
'వ్యాక్సినేషన్‌ కేంద్రాలను గుర్తించేందుకు ప్రత్యేక 'మ్యాప్‌లు'

By

Published : Mar 1, 2021, 5:44 PM IST

దేశంలో కరోనా టీకాల పంపిణీ చురుగ్గా సాగుతున్న వేళ వ్యాక్సిన్​ కేంద్రాలకు ప్రజలు మరింత సులువుగా చేరుకునేలా 'మ్యాప్‌ మై ఇండియా' సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు తమ సమీప ప్రాంతాల్లో ఉన్న వ్యాక్సినేషన్‌ కేంద్రాలను గుర్తించేందుకు మ్యాప్‌లను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న టీకా కేంద్రాల సమాచారాన్ని మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సంస్థ సీఈవో రోహన్‌ వర్మ తెలిపారు. మ్యాప్‌ల సాయంతో సమీపంలోని టీకా కేంద్రాలను తేలికగా గుర్తించేందుకు వీలుపడుతుందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు అంగీకరించినట్లు మ్యాప్‌ మై ఇండియా పేర్కొంది. కరోనా ప్రారంభ సమయంలో వైరస్‌ సమాచారాన్ని తెలియజేయడంలో మ్యాప్‌ మై ఇండియా సంస్థ తన వంతు పాత్ర పోషించింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలు పరీక్షా కేంద్రాలు, చికిత్స, ఐసోలేషన్‌ ప్రాంతాలను మ్యాప్‌ల రూపంలో ప్రజలతో ఈ సంస్థ పంచుకుంది. తాజాగా వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు సంబంధించిన మ్యాప్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది.

పోర్టల్​​లోనే రిజిస్ట్రేషన్

గూగుల్​ ప్లేస్టోర్​లో అందుబాటులో ఉన్న కొ-విన్​ యాప్​ కేవలం అధికారులు వినియోగించుకునేందుకే అని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకోవాలనుకునేవారు కొ-విన్​ పోర్టల్​ ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ట్విట్టర్​లో పేర్కొంది.

" కొవిడ్​-19 వ్యాక్సినేషన్ కోసం ​కొ-విన్ పోర్టల్​లోనే రిజిస్ట్రేషన్​, బుకింగ్​లు చేసుకోవాలి. టీకాల రిజిస్ట్రేషన్​ సౌలభ్యం కొ-విన్ యాప్​లో లేదు. ప్లే స్టోర్​లో ఉన్న యాప్​ అధికారులు వినియోగించేందుకు మాత్రమే."

-- కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ట్వీట్

కొవిన్-2.0 పోర్టల్​ ద్వారా టీకా లబ్ధిదారులు ఎక్కడినుంచైనా, ఎప్పుడైనా వ్యాక్సిన్​ కోసం రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చని తెలిపింది.

10లక్షలకు పైగా..

సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు దాదాపు 10 లక్షల మందికి పైగా పౌరులు వ్యాక్సిన్ కోసం కొవిన్-2.0 పోర్టల్​లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 60ఏళ్లు పైబడిన వాళ్లు టీకా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. సోమవారం ఉదయం 9 గంటలకు కొవిన్-2.0 పోర్టల్​ను ప్రారంభించింది.

ఇదీ చదవండి :నేటి నుంచి కొ-విన్​2.0 పోర్టల్​ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details