CM Uddhav Thackerays Wife Rashmi: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఇంకా కొలిక్కి రాలేదు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు పట్టు వీడటం లేదు. అసోంలోని గువాహటి క్యాంప్ నుంచి బయటకు అడుగుపెట్టడం లేదు. అవసరమైతే సీఎం పోస్టుకు రాజీనామా చేస్తానని ఉద్ధవ్ ఠాక్రే చెబుతున్నా రెబల్స్ ఎవరూ వినడం లేదు. ఏక్నాథ్ శిందేతోనే ఉంటామని తేల్చిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే రంగంలోకి దిగారు. ఆమె ఇప్పుడు రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి.. వాళ్ల భార్యలతో మాట్లాడుతున్నారు. భర్తకు నచ్చజెప్పి, గువాహటి నుంచి వచ్చేయాలని చెప్పమని విజ్ఞప్తి చేస్తున్నారు. సంక్షోభంలో పడిన తన భర్త ప్రభుత్వాన్ని మళ్లీ గట్టెక్కించేందుకు రష్మీ ఠాక్రే ఇలా తన వంతుగా కృషి చేస్తున్నారు.
15 మంది రెబల్ ఎమ్మెల్యేలకు వై ప్లస్ సెక్యూరిటీ.. మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం 15 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు వై ప్లస్ సెక్యూరిటీ కల్పించింది. నలుగురైదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు, షిఫ్టుల వారీగా ప్రతి ఎమ్మెల్యేకు భద్రతగా ఉంటారని కేంద్ర ఆదివారం తెలిపింది. కేంద్రం భద్రత కల్పించిన వారిలో రమేష్ బోర్నారే, మంగేష్ కుడాల్కర్, సంజయ్ శిర్సత్, లతాభాయ్ సోనావానే, ప్రకాశ్ సుర్వే సహా మరో 10 మంది ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు కూడా భద్రత కల్పిస్తామని అధికారులు తెలిపారు.
కోర్టుకు ఏక్నాథ్ శిందే?శివసేన శాసనసభా పక్షనేతగా ఏక్నాథ్ శిందేను తొలగిస్తూ మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై న్యాయ సలహా కోరిన తర్వాత శిందే కోర్టును ఆశ్రయించనున్నారు. నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు డిప్యూటీ స్పీకర్ కనీసం వారం రోజుల సమయం ఇవ్వాలని శిందే వర్గాలు చెబుతున్నాయి. కానీ అలా జరగలేదని, అందుకే న్యాయపోరాటం చేయాలని భావిస్తున్నట్లు తెలిపాయి.