హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తన మంచితనాన్ని చాటుకున్నారు. గొంతు కోసుకుపోయి పరిస్థితి విషమించిన పేషెంట్‌ను ఆస్పత్రికి తరలించేందుకు ఆయన హెలికాప్టర్‌ను పంపించారు. సుఖు తీసుకున్న నిర్ణయంతో ఓ నిండు ప్రాణాన్ని కాపాడినట్లైంది.
వివరాల్లోకి వెళ్తే..
చంబా జిల్లాలోని మారుమూల ప్రాంతం పాంగిలో భారీ హిమపాతం వల్ల ఆ ప్రదేశంతో.. బయటి ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి. ఆ ప్రాంత్రంలోని ధార్వాస్ గ్రామానికి చెందిన దేవేంద్ర అనే వ్యక్తి ఇంటి పనులు చేసుకుంటూ సోమవారం కిందపడిపోయాడు. కింద ఉంచిన డబ్బా రేకు.. దేవేంద్ర గొంతుకు తగిలి లోతుగా గాయమైంది. దీంతో వెంటనే అతడిని సమీపంలో ఉన్న కిల్లర్ ప్రాంతంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ ప్రథమ చికిత్స సౌకర్యం మాత్రమే ఉంది.
కిల్లర్ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు దేవేంద్రను కంగ్రా జిల్లాలోని రాజేంద్ర ప్రసాద్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అయితే హిమపాతం కారణంగా అక్కడికి వెళ్లే దారి మూసుకుపోయింది. అందువల్ల దేవేంద్రను ఆస్పత్రికి తరలించడం సవాలుగా మారింది. అటువంటి క్లిష్ట పరిస్థితిలో అతడిని తరలించేందుకు హెలికాప్టర్ అవసరం అనిపించింది. భర్మౌర్ ఎమ్మెల్యే డాక్టర్ జనక్రాజ్కు ఈ ఘటనపై సమాచారం అందింది. రోగి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న ఆయన.. అతడిని హెలికాప్టర్లో తరలించాలని సీఎం సుఖ్వీందర్ సింగ్‌ను వ్యక్తిగతంగా కోరారు.