CM Revanth Reddy First Speech : తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకార అనంతరం రెండు దస్త్రాలపై సంతకాలు చేసి, ఎన్నికల మేనిఫెస్టో(Congress Manifesto)లో కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేరుస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీల దస్త్రంపైనే తొలి సంతకం చేశారు. అలాగే గతంలో ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్ నాంపల్లి ప్రాంతానికి చెందిన దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగ నియామక ఉత్తర్వులపై రెండో సంతకం చేసి, అనంతరం రజీనీకి నియామక పత్రాన్ని అందించారు.
ప్రమాణస్వీకారం సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. త్యాగాలే పునాదులుగా ఏర్పడిన రాష్ట్రంలో పదేళ్లుగా నిరంకుశత్వాన్ని ప్రజలు మౌనంగా భరించారన్నారు. రాష్ట్ర ప్రజలకు నేటి నుంచి స్వేచ్ఛ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇటు ప్రమాణస్వీకారం చేస్తూనే మరోవైపు ప్రగతిభవన్(Pragathi Bhavan) ఇనుప కంచెలను బద్ధలు కొట్టించినట్లు తెలిపారు. జ్యోతిరావుపూలే ప్రజాభవన్‌లో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజాదర్బార్ జరుగుతుందని వెల్లడించారు. ఈ దర్బారుకు ప్రజలెవరైనా రావచ్చని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
"పోరాటాలతో ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ. త్యాగాలే పునాదులుగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. పదేళ్లుగా నిరంకుశత్వాన్ని ప్రజలు మౌనంగా భరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. తెలంగాణ ప్రజలకు ఇవాళ స్వేచ్ఛ వచ్చింది. ఇప్పటికే ప్రగతిభవన్ ఇనుప కంచెలను బద్ధలు కొట్టించాం. నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలన్నా ప్రజాభవన్‌కు రావచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు. సంక్షేమ, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతా. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతిరావుపూలే ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్. మేం పాలకులం కాదు మీ సేవకులం. పదేళ్లుగా కష్టపడిన కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా. విద్యార్థి, నిరుద్యోగ, అమలవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తాం."- రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి