Nitish Kumar Prashant Kishor : ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్‌తో భేటీ అయిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్ కుమార్. అయితే.. ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం ఉందా అనే ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు.
నీతీశ్ కుమార్, ప్రశాంత్ కిశోర్ మంగళవారం సాయంత్రం పట్నాలో భేటీ అయ్యారు. ఈ సమావేశం రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఇదే విషయమై బుధవారం నీతీశ్‌ను మీడియా మరింత స్పష్టత కోరగా.. ఆయన దాటవేశారు. పీకేతో తనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందని, అలాంటి వ్యక్తిని కలవడంలో ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల కోసం ప్రశాంత్‌తో మళ్లీ కలిసి పనిచేస్తారా అని అడగ్గా.. ఆ ప్రశ్నను పీకేనే అడగాలని మీడియా ప్రతినిధులకు సూచించారు బిహార్ సీఎం.
గతంలో ఎన్నికల వ్యూహకర్తగా నీతీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు సేవలు అందించారు ప్రశాంత్ కిశోర్. 2015లో బిహార్‌లో మహాకూటమి ప్రభుత్వం ఏర్పడడంలో కీలక భూమిక పోషించారు. 2018 సెప్టెంబరులో పీకే.. జేడీయూ పార్టీలో చేరారు. నితీశ్ ఆయనను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. అయితే కొంత కాలానికే వీరి మధ్య విభేదాలు వచ్చాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని 2020లో పీకేను జేడీయూ నుంచి బహిష్కరించారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, సురాజ్య మంత్రంతో బిహార్‌లో ప్రత్యామ్నాయ శక్తిగా నిలుస్తానని కొన్ని నెలల క్రితం ప్రకటించారు పీకే. త్వరలోనే పాదయాత్ర కూడా చేస్తానని చెప్పారు.మరోవైపు.. భాజపాను ఎదుర్కోగల ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటే లక్ష్యంగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు నీతీశ్. కొంతకాలంగా దేశంలోని భాజపాయేతర పార్టీల నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నీతీశ్ కుమార్‌తో ప్రశాంత్ కిశోర్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.