బిహార్ ఛాప్రా జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆ ప్రాంత పోలీస్ స్టేషన్ అధికారి రితేశ్ మిశ్రా, కానిస్టేబుల్ వికేశ్ తివారీలను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై బిహార్ ఎక్సైజ్ మంత్రి సునీల్ కుమార్ స్పందించారు. మృతుల మరణాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా ఎస్పీతో మాట్లాడానని, ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశానని మంత్రి వెల్లడించారు. మరోవైపు, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే ప్రసక్తే లేదని బిహార్ సీఎం నీతీశ్ కుమార్ తేల్చి చెప్పారు.
39కి చేరిన కల్తీ మద్యం మృతులు.. పరిహారం ఇచ్చేదే లేదన్న సీఎం - Bihar Hooch tragedy death toll
బిహార్ ఛాప్రా జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య 39కి చేరింది. ఈ ఘటనపై అధికారప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాగం జరుగుతోంది. కాగా, ఈ ఘటనలో చనిపోయిన మృతులకు పరిహారం ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు.
"బిహార్‌లో మద్య నిషేధం అమల్లో ఉంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మద్య నిషేధంపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎవరో ఒకరు అక్రమంగా విక్రయాలు చేస్తుంటారు. ప్రజలు మరణిస్తారు. అందుకే మద్యం తాగకూడదని గుర్తించుకోవాలి. మద్యపానం మంచిది కాదు. చాలామంది మద్య నిషేధానికి ఒప్పుకున్నారు. కల్తీ మద్యం తాగి మరణిస్తే నష్టపరిహారం ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది. కల్తీ మద్యం తాగితే చనిపోతారనే ఉదాహరణ మనముందే ఉంది. తాగితే చస్తారు. ఇది నిజం కదా."
-నీతీశ్‌కుమార్, బిహార్ ముఖ్యమంత్రి
అప్పటి నుంచే మద్యం బంద్..
బిహార్‌లో మద్యం వినియోగం, విక్రయాలపై 2016 ఏప్రిల్‌లోనే పూర్తిగా నిషేధం విధించారు. అయితే ఇటీవల రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. దీంతో ఈ ఘటనపై బిహార్ అసెంబ్లీలో బుధవారం ప్రతిపక్ష భాజపా ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు.