హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌కు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రోహ్తక్ ఎంపీ అర్వింద్ శర్మ తండ్రి ఇటీవల మరణించారు. దీంతో ఆయన సంస్మరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం శనివారం రోహ్తక్ జిల్లాలోని అస్థల్ బోహర్కు బయలుదేరారు. ఈ విషయం తెలిసిన రైతులు స్థానిక ప్రైవేటు యూనివర్సిటీలో సీఎం హెలికాప్టర్ దిగే ప్రాంతానికి పెద్దసంఖ్యలో చేరుకున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించడమే కాకుండా, బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. అన్నదాతలు వాటిని దాటుకొని యూనివర్సిటీలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిపై లాఠీఛార్జి చేశారు. ప్రతిగా రైతులు రాళ్లురువ్వారు. పలువురు రైతులతో పాటు ఓ పోలీసు కూడా గాయపడ్డారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడం వల్ల హెలికాప్టర్‌ను మరోచోట నిలిపారు.