CM KCR Visited Rain Affected Areas In Telangana: పంట నష్టపోయిన రైతులకు త్వరలోనే పరిహారం నిధులు అందేలా చూస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. వడగండ్ల వర్షం వల్ల ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. వర్షానికి అన్ని జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మొత్తం 2.28లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు తన దగ్గరకు లెక్కలు వచ్చాయని చెప్పారు. అందులో చాలా మంది రైతులు వందశాతం పంటలు నష్టపోయారన్నారు.
నష్టపోయిన పంటల్లో మొక్కజొన్న ఎక్కువగా ఉందని కేసీఆర్ తెలిపారు. వీటితో పాటు వరి, మామిడి, ఇతర పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయని.. బీభత్సమైన వర్షాలతో పంటలు అనేక చోట్ల తుడిచిపెట్టుకుపోయాయన్నారు. పంటలు నష్టపోయినప్పుడు రైతుల ఆత్మ స్థైర్యం దెబ్బతినకుండా ఇండియాలోనే తొలిసారిగా ఎకరాకు రూ. 10 వేలు పరిహారం ఇస్తామని ప్రకటించారు. కేంద్రానికి గతంలో నివేదికలిచ్చినా పరిహారం ఇవ్వలేదని.. అందుకే ఈసారి నివేదిక కూడా పంపడం లేదని.. రాష్ట్ర ఖజానా నుంచే తామే పరిహారం ఇస్తామని కేసీఆర్ ప్రటించారు. పరిహారం ఎప్పుడో ఇవ్వడం కాదని.. జీవో జారీచేశామని ప్రకటించారు. రైతులు నెర్వస్ కావొద్దని ధైర్యం చెప్పారు.
రాబోయే రోజుల్లో ఇంకా అకాల వర్షాలు పడే ప్రమాదముందన్న కేసీఆర్.. రైతుల వెంటే తమ ప్రభుత్వం ఉంటుందన్నారు. కౌలు రైతులకు కూడా పరిహారం అందేలా చూడాలని కలెక్టర్లను కేసీఆర్ ఆదేశించారు. ఇవాళ కరీంనగర్‌లోని చొప్పదండి ప్రాంతాన్ని పరిశీలించిన కేసీఆర్ సమైక్య రాష్ట్ర సమయంలో ఈ ప్రాంతం ఎడారిని తలపించేందని.. ఇప్పుడు పచ్చని మాగాణిగా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల చాలా ప్రాంతాలకు వేసవిలోనూ నీళ్లు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో 84 లక్షల ఎకరాల్లో రెండో పంట సాగు అవుతుందన్నారు.