CM KCR to unveil Ambedkar statue : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మారకం ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2016 ఏప్రిల్ 14న బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. విగ్రహ ఆవిష్కరణ కమిటీ కడియం శ్రీహరి నేతృత్వంలో ఏర్పాటైంది. ఎస్సీ సంక్షేమశాఖ డీపీఆర్ రూపొందించడానికి కన్సల్టెన్సీ సేవల కోసం డిజైన్ అసోసియేట్స్‌ను నియమిస్తూ 2018 ఏప్రిల్ 4న ఉత్తర్వులు జారీ చేసింది. కన్సల్టెన్సీ వృత్తాకార, చతురస్రాకారస్తూపాల డిజైన్లు సిద్ధంచేయగా, సీఎం కేసీఆర్.. వృత్తాకార నమూనాకు ఆమోదం తెలిపారు.
Ambedkar statue unveiling today : పార్లమెంటు భవనం నమూనాలో సిద్ధం చేయాలని సూచించారు. దిల్లీలోని రాంసుతార్ ఫైన్ ఆర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్, మత్తురామ్ ఆర్ట్స్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు చెందిన శిల్పుల పర్యవేక్షణలో డీపీఆర్ సిద్ధమైంది. ఈ మేరకు 2020 సెప్టెంబరు 16న రూ.146.5 కోట్లకు ఎస్సీ సంక్షేమ శాఖ పరిపాలన ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూన్ 6న ఒప్పందంచేసుకుని 12 నెలల్లోగా పనులు పూర్తి చేయాలని షరతు విధించగా పనుల పురోగతిని సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూ వచ్చారు.
ముఖ్య అతిథిగా అంబేడ్కర్ మనవడు..హుస్సేన్‌సాగర్ తీరంలో రూపుదిద్దుకున్న ఆ భారీవిగ్రహాన్ని మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ అట్టహాసంగా ఆవిష్కరించనున్నారు. అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పార్లమెంట్ ఆకారంలో 50 అడుగుల పీఠంపై ఏర్పాటుచేసిన 125 అడుగుల లోహ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 50 వేల మంది ప్రజలు తరలివచ్చేందుకు అన్ని ఏర్పాట్లుచేసింది.