CM KCR Speech at Ambedkar statue Unveiling Meeting : దేశానికే దిక్సూచిలా, సమానత్వ స్ఫూర్తిని నిత్యం రగిలించేలా... హైదరాబాద్ సాగర తీరానా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్... అతిపెద్ద విగ్రహం కొలువుదీరింది. రాజ్యాంగ నిర్మాత జయంతి వేళ 125 అడుగుల బాబా సాహెబ్ కాంస్య ప్రతిమను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. దేశమంతా ఏటా 25 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇచ్చే రోజు వస్తుందన్నారు.
అంబేడ్కర్ విశ్వ మానవుడు : సభా వేదికపై జైభీమ్ అంటూ ప్రసంగం ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అంబేడ్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు దాటిందన్నారు. ఏటా అంబేడ్కర్ జయంతి జరుపుకుంటున్నామన్న సీఎం.. అంబేడ్కర్ విశ్వ మానవుడు అని కొనియాడారు. అంబేడ్కర్ సిద్ధాంతం విశ్వజనీనం, సార్వజనీనమన్న కేసీఆర్.. ఆయన కలలు సాకారం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎవరో అడిగితే అంబేడ్కర్ విగ్రహం పెట్టలేదన్నారు. విశ్వమానవుడి విశ్వరూపం ప్రతిష్టించుకున్నామని తెలిపారు.
'సచివాలయానికి కూడా అంబేడ్కర్ పేరు పెట్టుకున్నాం. ఇక్కడికి దగ్గరలోనే అమరవీరుల స్మారకం ఉంది. అంబేడ్కర్ విగ్రహం సమీపంలోనే బుద్ధుడి విగ్రహం ఉంది. అంబేడ్కర్ సిద్ధాంతాలు స్మరణకు వచ్చేలా ఏర్పాట్లు చేశాం. ఇది విగ్రహం కాదు.. విప్లవం. తెలంగాణ కలలు సాకారం చేసుకునే చిహ్నం ఈ విగ్రహం. విగ్రహ ఏర్పాటుకు కృషిచేసిన అందరికీ ధన్యవాదాలు.'-సీఎం కేసీఆర్