తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గజ్వేల్, కామారెడ్డిల్లో సీఎం కేసీఆర్ నామినేషన్ - భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు - గజ్వేల్​లో నామినేషన్​ వేసిన సీఎం కేసీఆర్

CM KCR Nomination in Gajwel 2023 : బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్‌ నామినేషన్‌ వేశారు. శాసనసభ ఎన్నికలకు రెండుచోట్ల పోటీ చేస్తున్న ఆయన.. ముందుగా తన పాత నియోజకవర్గమైన గజ్వేల్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు.

cm kcr
CM KCR Nomination in Gajwel 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2023, 12:58 PM IST

Updated : Nov 9, 2023, 2:24 PM IST

CM KCR Nomination in Gajwel 2023: భారత్​ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్​లో నామినేషన్​ దాఖలు చేశారు. స్థానిక సమీకృత భవనంలో రిటర్నింగ్ అధికారికి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను సీఎం అందజేశారు. అనంతరం ప్రచార వాహనం పైనుంచి అక్కడికి వచ్చిన ప్రజలు, కార్యకర్తలకు అభివాదం చేశారు. ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్​లో అక్కడి నుంచి బయలుదేరారు. ఈ ఎన్నికల్లో కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్న ఆయన.. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ నామినేషన్ వేయనున్నారు. ఆపై బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడనున్నారు. అంతకుముందు ఎర్రవెల్లి నుంచి గజ్వేల్​కు ప్రత్యేక హెలికాప్టర్​లో వెళ్లిన సీఎం.. అక్కడి నుంచి పార్టీ నేతలతో కలిసి సమీకృత కార్యాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రి నామినేషన్‌ సందర్భంగా బీఆర్​ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో గజ్వేల్‌లో కోలాహలం నెలకొంది.

హ్యాట్రిక్‌ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచార హోరు - అభివృద్ధిని గుర్తించి దీవించాలని వేడుకుంటున్న అభ్యర్థులు

CM KCR Nomination at Kamareddy : గజ్వేల్​ నుంచి కామారెడ్డి చేరుకున్న సీఎం కేసీఆర్ నేరుగా.. స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటికి చేరుకున్నారు. ఆయన నివాసంలో నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఇటీవల కామారెడ్డిలో చోటుచేసుకున్న వివాదాలపై ఆరా తీశారు. గ్రూప్ తగాదాలు వీడాలని, కలిసి కట్టుగా పని చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ గీత దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల్లో పార్టీ నుంచి తప్పుడు సంకేతాలు వెళ్లొద్దని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శేరి సుభాశ్​ రెడ్డి, గంప గోవర్ధన్, స్థానిక ముఖ్య నేతలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం నేరుగా ఆర్డీవో కార్యాలయానికి వెళ్లిన ఆయన.. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు.

ప్రలోభాలపై ఈసీ ప్రత్యేక నజర్ - గతానుభవాల దృష్ట్యా పకడ్బందీ చర్యలు

ఇదిలా ఉండగా.. ఈ ఎన్నికల్లో గజ్వేల్​, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్​కు ప్రతిపక్ష పార్టీల నుంచి బలమైన నేతలు ప్రత్యర్థులుగా ఉన్నారు. గజ్వేల్​లో బీజేపీ ముఖ్య నేత ఈటల రాజేందర్ బరిలో నిలవగా.. కాంగ్రెస్ తరఫున తూంకుంట నర్సారెడ్డి కేసీఆర్​పై పోటీకి దిగుతున్నారు. ఇక కామారెడ్డిలో కాంగ్రెస్​ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్​ రెడ్డి సీఎంతో సమరానికి సై అంటున్నారు. చూడాలి మరి.. రెండు చోట్ల పోటీ చేస్తున్న కేసీఆర్​కు ఈటల, రేవంత్​రెడ్డిలు ఎంతమేరకు పోటీనిస్తారో అని.​

'సింగరేణిని ముంచింది కాంగ్రెస్​ - లాభాల బాట పట్టించింది బీఆర్​ఎస్'​

Last Updated : Nov 9, 2023, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details