GLOBAL INVESTORS SUMMIT: విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం వద్ద నేటి నుంచి రెండు రోజుల పాటు జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. సదస్సు కోసం ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణి భారతి గురువారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఆయన తను బస చేస్తున్న హోటల్ నుంచి ఈ ఉదయం 9 గంటల ప్రాంతంలో సదస్సు జరిగే ప్రాంగణానికి వస్తారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది.
కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్‌రెడ్డి, పారిశ్రామిక దిగ్గజాలు.. రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా, టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, GMRగ్రూప్ అధినేత జి. మల్లికార్జునరావు, భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ క్రిష్ణ ఎం.ఎల్లా, దాల్మియా గ్రూప్ ఛైర్మన్ పునీత్ దాల్మియా మరికొన్ని సంస్థల అధినేతలు ప్రత్యేక అతిథులుగా వస్తున్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత వివిధ పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు 118 స్టాల్స్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి జగన్, కేంద్రమంత్రి గడ్కరీ ప్రారంభిస్తారు. భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఐటీ, పారిశ్రామిక రవాణా, పునరుత్పాదక ఇంధన వనరులు, విద్యుత్ వాహనాలు, అంకుర సంస్థలు, ఆరోగ్యం, వ్యవసాయం, రక్షణ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై చర్చా గోష్ఠులు జరుగుతాయి.