తెలంగాణ

telangana

ETV Bharat / bharat

CM Jagan on Groups: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. ఆ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్​ సిగ్నల్​

Group 1 and Group 2 in AP: గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ల జారీకి సీఎం జగన్ పచ్చజెండా ఊపారు. ఈ పోస్టుల భర్తీపై సమీక్ష ని‌ర్వహించిన సీఎం...త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఆదేశించారు. పోస్టుల భర్తీపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు.

Group 1 and Group 2 in AP
Group 1 and Group 2 in AP

By

Published : May 25, 2023, 5:34 PM IST

Group 1 and Group 2 in AP: ఆంధ్రప్రదేశ్​లోని నిరుద్యోగులకు సీఎం జగన్​ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పచ్చజెండా ఊపారు. దాదాపు 1000కి పైగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. పోస్టుల భర్తీకి సంబంధించి అతి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఖాళీగా ఉన్న గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీపై సీఎం సమీక్షించారు. ఖాళీగా ఉన్న పోస్టుల గురించి సీఎంకు అధికారులు వివరాలు అందించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు.

పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని తెలిపారు. నోటిఫికేషన్‌ జారీకి అవసరమైన కసరత్తు తుది దశలో ఉందని తెలిపారు. గ్రూప్‌-1కి సంబంధించి సుమారు 100కి పైగా పోస్టులు ఉన్నాయని, గ్రూప్‌-2కు సంబంధించి సుమారు 900కి పైగా పోస్టులు ఉన్నట్లు వెల్లడించారు. మొత్తంగా 1000కి పైగా పోస్టులు భర్తీ చేయనున్నామని తెలిపారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేయాలని సీఎం ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

నాలుగు సంవత్సరాల తర్వాత గ్రూప్​ 1 ఫలితాలు: ఏపీలో గ్రూప్ 1 ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 2022 జులై5 విడుదల చేసింది. నాలుగు సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత ఇంటర్యూల్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను విడుదల చేశారు. అయితే వాస్తవానికి ఈ ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియ 2018లో ప్రారంభమైంది. కానీ వివిధ కారణాలతో నియామక ప్రక్రియ ఆలస్యం అవుతూ వచ్చింది. మొత్తం 167 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి 2018లో APPSC నోటిఫికేషన్ విడుదల చేసింది.

హైకోర్టుకు గ్రూప్​ 1 అభ్యర్థులు: అయితే గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాలను మాన్యువల్‌ విధానంలో రెండు సార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ తర్వాత మరోసారి దీనిపై అదనపు అఫిడవిట్​ దాఖలు చేశారు. మొదటిసారి దిద్దిన ఫలితాలను తొక్కిపెట్టి, రెండోసారి దిద్దించారని అందులో పేర్కొన్నారు. నచ్చిన వారిని ఎంపిక చేసుకొని ఏపీపీఎస్సీ ఫలితాలు ప్రకటించిందన్నారు. 2018 నోటిఫికేషన్‌కు సంబంధించిన గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాలను స్కాన్‌ చేసి ‘డిజిటల్‌’ విధానంలో దిద్దినట్లు, ప్రత్యేక షీట్‌లో మార్కులు వేసినట్లు ఏపీపీఎస్సీ గతంలో సింగిల్‌ జడ్జికి తెలిపిందన్నారు. జబాబు పత్రాలతో ఉన్న ఓఎంఆర్​ షీట్లను డిజిటల్‌ మూల్యాంకనంలో వినియోగించలేదని తేటతెల్లమవుతోందని.. వాటిని 2021 డిసెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి మధ్య జరిగిన తొలి మాన్యువల్‌ మూల్యాంకనంలో వినియోగించారని అఫిడవిట్‌లో వివరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details