'మెగా' డీఎస్సీ హామీ గుర్తుందా జగన్? CM Jagan Cheating Unemployed :ఏపీలో ప్రతిపక్ష నేతగా నిరుద్యోగులపై జగన్ ఒలకబోసిన ప్రేమ అంతా ఇంతా కాదు. అధికారంలోకి వచ్చాక ఏం చేశారు? ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోగా రోడ్డెక్కిన నిరుద్యోగుల గొంతు నొక్కుతున్నారు! విద్యార్థుల్ని పోలీసులతో ఈడ్చిపారేయించారు. కొలువులడిగినందుకు కుళ్లబొడిచారు. తెలుగుదేశం హయాంలో 18,215 పోస్టులతో రెండు నోటిఫికేషన్లు వచ్చాయి. అవి కంటితుడుపేనని యాగీ చేసిన జగన్ ఇప్పుడు కనీసం ఒక్కటంటే ఒక్క పోస్టుకూ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం దగా కాదా?
రెండు భిన్న ప్రకటనలతో గందరగోళం :ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స ఈ మాట గతేడాది మార్చిలో చెప్పిన మాట గుర్తుందా? మళ్లీ మార్చి వచ్చేస్తోంది. ఏడాది కావస్తున్నా ఆశావహులకు నీరసం తప్ప ప్రభుత్వం నుంచి నోటిఫికేషనైతే రాలేదు. జగన్ ఏలుబడిలో విద్యాశాఖకు ఇద్దరు మంత్రులు మారారు. మెగా కాదు కదా మినీ డీఎస్సీ కూడా వేయలేదు. ఈ విషయంలో వైఎస్సార్సీపీ సర్కార్‌ది ఏరోజుకు ఆపాటే! విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణే రెండు భిన్న ప్రకటనలతో గందరగోళం సృష్టించారు. గతేడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 771 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సెప్టెంబరులో జరిగిన సమావేశాల్లో18వేల 520 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిల్లో 8వేల366 పోస్టులు మాత్రమే అవసరమని శాసనమండలిలో వెల్లడించారు. అంటే ఆర్నెళ్లలోనే పోస్టులు పుట్టుకొచ్చాయన్నమాట.
'మెగా డీఎస్సీ పేరుతో మోసం' - విద్యార్థి, యువజన సంఘాల ఆందోళన
ఉన్నత పాఠశాలల్లో విలీనం :రాష్ట్రంలో లక్షా 88 వేల 162 ఉపాధ్యాయ పోస్టులు ఉంటే లక్షా 69 వేల 642 మంది పని చేస్తున్నట్లు ప్రభుత్వమే లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చింది. ఈ లెక్కన 18 వేలకు పైగా ఖాళీలున్నాయి. మంత్రి బొత్స మాత్రం 8వేల 366 పోస్టులే అవసరమంటున్నారు. మరి మిగతా 10వేల 154 పోస్టుల్ని ప్రభుత్వం రద్దు చేస్తుందా? లేదంటే 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం పోస్టుల సర్దుబాటు, వందశాతం పదోన్నతుల సాకుతో ఎత్తేసిందో స్పష్టత లేదు.
ఎస్జీటీ పోస్టులు రద్దు : నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల్ని నయవంచన చేసిన జగన్ సర్కార్ఖాళీ పోస్టుల్ని భవిష్యత్తులో కూడా భర్తీ చేసే అవకాశం లేకుండా ఉన్న వాటినే రద్దు చేస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, 6,592 ఎస్జీటీ, 1,160 ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ ఉపాధ్యాయ పోస్టుల్ని రద్దు చేసింది. సొసైటీలో కొనసాగుతున్న ఆదర్శపాఠశాలల్ని ప్రభుత్వంలోకి తీసుకొచ్చేందుకంటూ 4 వేల 764 ఎస్జీటీ పోస్టుల్ని ప్రభుత్వం రద్దు చేసింది.
జాతీయ విద్యా విధానంలో ఆర్ట్, క్రాఫ్ట్ పోస్టులకు ప్రాధాన్యం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీటిని రద్దు చేస్తోంది. రాష్ట్ర స్థాయిలో అయిదు అదనపు డైరెక్టర్ పోస్టులను సృష్టించేందుకు 2021 అక్టోబరులో 15 ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ ఉపాధ్యాయ పోస్టులు రద్దు చేశారు. కొత్తగా 692 మండల విద్యాధికారుల పోస్టులు సృష్టించేందుకు 1,145 ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ పోస్టులు రద్దు చేశారు. హైస్కూల్ ప్లస్‌లో ప్రభుత్వం ఇంటర్ ప్రవేశ పెట్టింది. కానీ జూనియర్ లెక్చరర్లను నియమించకుండా పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ఒక ఇంక్రిమెంట్ ఇచ్చేసి వారిని నియమించింది. దీని కోసం 1752 ఎస్జీటీ పోస్టుల్ని రద్దు చేసింది. ఇవి కాకుండా కర్నూలు జిల్లాలో ప్రధానోపాధ్యాయ పోస్టుల కోసం 76 ఎస్జీటీలను కనుమరుగు చేసింది.
మెగా డీఎస్సీ ప్రచారమే తప్ప ప్రకటన ఊసు ఎక్కడ ?
పోస్టుల్లో కోత :ఇక వైసీపీ సర్కార్ తెచ్చిన నూతన విద్యా విధానంతో మరికొన్ని పోస్టులు గల్లంతయ్యాయి. 1 నుంచి 9 తరగతులకు గతంలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు ఉండగా ఇప్పుడు తెలుగును రద్దు చేసి, ఆంగ్ల మాధ్యమం ఒక్కటే పెట్టారు. అలా తెలుగు మాధ్యమంలో ఉన్న వారిని మిగులుగా తేల్చి ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేశారు. ఫలితంగా పోస్టుల్లో కోత పడింది. 9,10 తరగతుల్లో 60 మంది విద్యార్థులకు ఒకే సెక్షన్ 6 నుంచి 8 తరగతులకు 52మందికి ఒక్కటే సెక్షన్‌గా పెట్టారు. సెక్షన్‌కు విద్యార్థుల సంఖ్య పెంచడంతో ఉపాధ్యాయుల అవసరం తగ్గిపోయింది. 3 నుంచి 10 తరగతులుండే పాఠశాలలో 137మందికిపైగా విద్యార్థులు ఉంటేనే ప్రధానోపాధ్యాయుడు వ్యాయామ ఉపాధ్యాయుడి పోస్టు ఇచ్చారు.
విద్యార్థుల సంఖ్య తక్కువగాఉన్నచోట PET, ప్రధానోపాధ్యాయుడి పోస్టు తీసేశారు. అక్కడ పని చేసే సీనియర్ ఉపాధ్యాయుడికే ప్రధానోపాధ్యాయుడి బాధ్యతలు, పాఠాల బోధన అప్పగించారు. అలాంటి బడుల్లో రెండేసి పోస్టులు ఎగిరిపోయాయి. 3 నుంచి 8 తరగతులున్న బడిలో 6,7,8 తరగతుల్లో 30మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే గణితం, సామాన్యశాస్త్రం, ఆంగ్ల సబ్జెక్టులకు మాత్రమే సబ్జెక్టు టీచర్లను ఇచ్చారు. 30 మందిలోపు పిల్లలు ఉంటే ఒకే ఒక్క స్కూల్ అసిస్టెంట్‌ను ఇచ్చారు.
సబ్జెక్టు టీచర్లతో బోధన చేయిస్తామన్న ప్రభుత్వం తన హామీని తానే తుంగలోతొక్కి టీచర్ పోస్టుల మిగుల్చుకుంది. 3,4,5 తరగతులకు సబ్జెక్టు టీచర్లతో బోధనంటూ ప్రాథమిక పాఠశాలలకు కిలోమీటరు దూరంలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3,4,5 తరగతులను విలీనం చేసేశారు. ఫలితంగా 1,2 తరగతుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి ఏకోపాధ్యాయ బడులుగా మారిపోయాయి. 20 మందికిపైగా విద్యార్థులున్నా ఒక్కరినే నియమించింది. అలా SGTపోస్టులూ భారీగా మిగిలిపోయాయి. ఇలా టీచర్ పోస్టుల ఖాళీల్ని భారీగా కుదించిన వైసీపీ సర్కార్ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను నియమించకుండా ట్యాబ్‌లు, స్మార్ట్‌టీవీలంటూ కమీషన్లు వచ్చే వాటికి ఖర్చు చేస్తోంది. బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లు ఇచ్చాం. మీరే చదువుకోండి అన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
మెగా డీఎస్సీ ప్రకటించకుంటే వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం: నిరుద్యోగులు