Approval For Groups in AP: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. క్యాలెండర్ విధానంలో ఉద్యోగాల భర్తీ అమలులో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం కనీసం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సకాలంలో నోటిఫికేషన్లు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో గ్రూపు-1 కింద 100, గ్రూపు-2 కింద 900 చొప్పున పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
వైసీపీ హయాంలో 'క్యాలెండర్ విధానం' అమలు పూర్తిగా అటకెక్కింది. 2021 జూన్‌లో జారీ చేసిన ప్రకారం ఇంకా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తారో లేదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. విలువైన కాలాన్ని దుర్వినియోగం చేసి తీరిగ్గా.. ఎన్నికల సంవత్సరంలో గ్రూపు-1, 2 పోస్టుల భర్తీపై ప్రకటన జారీచేసింది. 2021 పోస్టుల భర్తీలో క్యాలెండర్ విధానాన్ని పాటిస్తామని, నెలల వారీగా నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పినా.. ఆ మేరకు చర్యలు తీసుకోలేదు.
ఎన్నికల వేళ నిరుద్యోగులపై సర్కారు కనికరం: వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలుపుతూ 2021 జూన్ 18, గతేడాది మార్చిలో ఆర్థికశాఖ జారీ చేసిన ఉత్తరులకు అనుగుణంగా ఇప్పటికీ గ్రూపు-2 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పటివరకూ గ్రూపు-2 నోటిఫికేషన్ గురించి నోరెత్తని ప్రభుత్వం.. ఎన్నికల వేళ నిరుద్యోగులపై మమకారాన్ని చూపిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రూపు-1, గ్రూపు-2 కింద 100, 900 చొప్పున పోస్టుల భర్తీకి సీఎం జగన్ పచ్చజెండా ఊపారని ప్రభుత్వం ప్రకటించింది. పోస్టుల భర్తీపై అధికారులు సీఎంకు వివరాలు అందించారు.