భారత్‌లో తయారవుతోన్న కరోనా టీకాలు.. రూపాంతరం చెందుతున్న వైరస్‌పైనా సమర్థంగా పని చేయగలవని భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఈ మేరకు నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్‌లో వచ్చిన మధ్యంతర ఫలితాలు సూచిస్తున్నాయని పేర్కొంది. బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల్లో పరివర్తన చెందుతున్న కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో సమర్థంగా పని చేస్తాయని వెల్లడించింది.
కేరళ ఆరోగ్యశాఖ నిర్వహించిన "కేరళ హెల్త్: మేకింగ్ ది ఎస్డీజీఏ రియాలిటీ" కార్యక్రమంలో మాట్లాడిన ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్.. మన టీకాలు బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా వైరస్‌పై సమర్థంగా పని చేయగలవని ప్రచురించడానికి ఓ జర్నల్ అంగీకరించినట్లు పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాలకు చెందిన ప్రయాణికుల నుంచి కరోనా వైరస్ శాంపిల్స్ సేకరించి, వేరు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.