Margadarsi: సీఐడీ అధికారుల తీరుతో.. మార్గదర్శి ఖాతాదారుల ఇబ్బందులు Margadarsi Clients Troubled by CID Officials: మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాంచిల్లో రెండు రోజులుగా సోదాలు చేస్తున్న సీఐడీ అధికారులు, సిబ్బంది.. ఖాతాదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చిట్టీల సొమ్ము చెల్లించడానికి, ఇతర పనులపై మార్గదర్శి కార్యాలయాలకు ఆదివారం వచ్చిన వారిని లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. వారు ఎందుకొచ్చారో ఆరా తీసి.. వెనక్కి పంపేశారు.
సీఐడీ అధికారుల తీరుతో మార్గదర్శి ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్రాంచిల వద్దకు ఖాతాదారులు చిట్టీల వాయిదా సొమ్ము కట్టడానికి వచ్చామని చెబుతున్నా.. పోలీసులు పట్టించుకోలేదు. పాసుపుస్తకాలు చూపించినా లోపలకు పంపలేదు. కార్యాలయంలో ఆడిట్ జరుగుతోందని, ఇప్పుడు వెళ్లడానికి కుదరదంటూ.. అనుమతి నిరాకరించారు.
రెండు, మూడు రోజుల తర్వాత రావాలని సూచించారు. చిట్టీ వాయిదా సొమ్ము గడువులోగా చెల్లించకపోతే అపరాధ రుసుము పడుతుందని కొందరు చెప్పినా సీఐడీ సిబ్బంది, పోలీసులు వినిపించుకోలేదు. వారి తీరుతో మార్గదర్శి ఖాతాదారులు పలువురు ఇబ్బందులు పడ్డారు. 50 ఏళ్లు దాటిన వారు, పిల్లలతో కలిసి వచ్చినవారు సీఐడీ, పోలీసుల చర్యల వల్ల ఇబ్బందులకు గురయ్యారు.
కొన్నిచోట్ల కార్యాలయాల తలుపులు మూసేసి తనిఖీలు నిర్వహించారు. పలు కార్యాలయాల్లో ఖాతాదారులు చెల్లించిన మొత్తాలకు రసీదులు, ఖాతా స్టేట్‌మెంట్ల నకళ్లను తీసుకున్నారు. మహిళా ఉద్యోగులను రాత్రి 8గంటల వరకు అందుబాటులో ఉంచుకుని, తర్వాత పంపేశారు.
ఫోర్‌మెన్, అకౌంట్స్ అధికారులను మాత్రం రాత్రి కూడా కార్యాలయంలోనే ఉంచుకుని, అవసరమైన సమాచారం తీసుకుంటున్నారు. కార్యాలయాల వారీగా ఏజెంట్లను పిలిపించుకుని వారివద్ద వివరాలు తీసుకున్నారు. కంప్యూటర్ హార్డ్‌డిస్కులు, మెయిళ్లలోని సమాచారాన్ని ప్రింట్లు తీసుకున్నారు. పలు కార్యాలయాల్లో ఆడిటర్లతో తనిఖీలు చేయించారు. ప్రింట్లు తీసిన కాగితాలను ఆడిటర్లకు చూపించారు.
విశాఖపట్నంలోని సీతంపేట, ఎంవీపీ కాలనీ, గాజువాక బ్రాంచిల వద్దకు వచ్చిన ఖాతాదారుల్ని పోలీసులు వెనక్కి పంపేశారు. విజయనగరంలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వచ్చిన చందాదారులందర్నీ పోలీసులు గేటు వద్దే అడ్డుకొని వెనక్కి పంపించేశారు. లోపలకు వెళ్లడానికి వీల్లేదని.. తర్వాత రావాలని చెప్పారు.
విజయవాడలోని లబ్బీపేట, వన్‌టౌన్, గవర్నర్‌పేట బ్రాంచిలతో పాటు గుంటూరు, తెనాలి, నరసరావుపేట, చీరాల, కర్నూలు, మచిలీపట్నం, గుడివాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, మండపేట, సామర్లకోట, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం మార్గదర్శి కార్యాలయాల్లోకి ఖాతాదారుల్ని అనుమతించలేదు.
వారంతా తప్పనిసరి పరిస్థితుల్లో వెనుదిరిగారు. కొన్నిచోట్ల మార్గదర్శి సిబ్బంది, ఏజెంట్లు కార్యాలయం బయటే ఖాతాదారుల నుంచి నగదు తీసుకుని వారికి రసీదులు అందించారు. మార్గదర్శికి సంబంధించిన 37 బ్రాంచిల్లో శనివారం ఉదయం ప్రారంభమైన తనిఖీలు.. ఆదివారం రాత్రి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి.
ఇవీ చదవండి: