తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పరిశుభ్రమైన నగరాలుగా ఇందౌర్, సూరత్- స్టేట్స్ లిస్ట్​లో మహారాష్ట్ర నంబర్.1

Cleanest City in India : స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకింగ్​లో మధ్యప్రదేశ్​కు చెందిన ఇందౌర్, గుజరాత్​కు చెందిన సూరత్ నగరాలు ఉమ్మడిగా తొలి స్థానంలో నిలిచాయి. ఇందౌర్ నగరం వరుసగా ఏడోసారి మొదటి స్థానాన్ని సంపాదించింది. దీంతో అక్కడి పారిశుద్ధ్య కార్మికులు సంబరాలు చేసుకున్నారు.

By PTI

Published : Jan 11, 2024, 2:10 PM IST

Cleanest City India
Cleanest City India

Cleanest City in India :దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరాలుగా ఇందౌర్, సూరత్ నిలిచాయి. ఈ మేరకు 2023 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల జాబితాలో తొలి స్థానం సంపాదించాయి. నవీ ముంబయి మూడో స్థానంలో నిలిచింది. బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ కేటగిరీలో మహారాష్ట్ర తొలి స్థానంలో నిలవగా మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్ ఆ తర్వాతి ర్యాంకులు దక్కించుకున్నాయి. మధ్యప్రదేశ్​లోని ఇందౌర్ నగరం ( Indore Cleanest City Award) అత్యంత పరిశుభ్ర నగరంగా రికార్డుకెక్కడం ఇది వరుసగా ఏడోసారి కావడం విశేషం. ఈసారి ఇందౌర్​కు తోడుగా గుజరాత్​లోని సూరత్ సైతం తొలి ర్యాంకు దక్కించుకుంది.

రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకుంటున్న మోహన్ యాదవ్
క్లీన్లీయెస్ట్ సిటీ అవార్డును స్వీకరిస్తున్న సూరత్ అధికారి

మధ్యప్రదేశ్​కు చెందిన బుద్నీ, మౌ, అమర్​కంఠక్ సహా ఆరు నగరాలకు సైతం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు లభించాయి. ఛత్తీస్​గఢ్​కు చెందిన ఐదు నగరాలు సైతం అవార్డులు అందుకున్నాయి. 4,447 పట్టణ స్థానిక సంస్థలు స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 సర్వేలో పాల్గొన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పారిశుద్ధ్య సర్వే ఇదేనని కేంద్రం వెల్లడించింది. 12 కోట్ల మంది పౌరుల అభిప్రాయాలు తీసుకుని సర్వే నిర్వహించినట్లు తెలిపింది.

  • లక్ష లోపు జనాభా ఉన్న పట్టణాల్లో సాస్వడ్ (మహారాష్ట్ర)కు తొలి స్థానం. రెండు, మూడు స్థానాల్లో పాటన్(ఛత్తీస్​గఢ్), లోణావాలా(మహారాష్ట్ర).
  • పరిశుభ్రమైన గంగాతీర పట్టణంగా వారణాసి. రెండో స్థానంలో ప్రయాగ్​రాజ్. రెండూ యూపీ నగరాలే.
  • పరిశుభ్రమైన కంటోన్మెంట్ బోర్డుల్లో మధ్యప్రదేశ్​లోని 'మౌ'కు తొలి స్థానం.

'వచ్చే ఏడాదీ మేమే!'
గురువారం దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఇందౌర్ సిటీకి దక్కిన అవార్డును మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు.

"పరిశుభ్రంగా ఉండటం ఇందౌర్ ప్రజల అలవాటు మాత్రమే కాదని, వారి ఆలోచనల్లో ఇది ఇమిడిపోయిందని ఇప్పుడు నిరూపితమైంది. పరిశుభ్రత విషయంలో ఇది అతిపెద్ద విజయం. మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛ భారత్​ను సాకారం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రతిజ్ఞ పట్ల మధ్యప్రదేశ్ ప్రజలు ఎల్లప్పుడూ నిబద్ధతతో ఉన్నారు" అని ఎంపీ సీఎం మోహన్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏడాది సైతం తొలి ర్యాంకు సాధించేందుకు కృషి చేస్తామన్నారు.

ఇందౌర్ విజయ ప్రస్థానం
దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా ఇందౌర్ తొలిసారి 2017లో రికార్డు సాధించింది. అప్పటి నుంచి ఏటా ఈ అవార్డును గెలుచుకుంటూ వస్తోంది. పరిశుభ్ర నగరంగా నిలిచేందుకు ఇందౌర్ యంత్రాంగం అనేక చర్యలు తీసుకుంది. 2016లో ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ మొదలు పెట్టింది. తడి, పొడి చెత్తను వేరు చేయడం, టాయిలెట్ల నిర్మాణం, పొడి చెత్తను వంద శాతం ప్రాసెసింగ్ చేయడం వంటి ప్రణాళికలను పక్కాగా అమలు చేసింది. తడి చెత్త నుంచి బయో మీథేన్​ను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద ఆసియాలోనే అతిపెద్ద ప్లాంట్​ను ఏర్పాటు చేసింది.

కార్మికుల సంబరాలు
ఇందౌర్​కు అవార్డు దక్కిన ప్రకటన వెలువడగానే ఆ నగరంలోని పారిశుద్ధ్య కార్మికులు సంబరాలు చేసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణంలో భారీ ఎల్ఈడీ స్క్రీన్​ను ఏర్పాటు చేసి అవార్డుల కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. అవార్డుల వేడుకను వీక్షిస్తూ కార్మికులు డ్యాన్సులు చేశారు.

గ్రామస్థుల సంకల్పం.. 15 రోజుల్లోనే ప్లాస్టిక్​కు చెక్.. ఒకే ఒక్క నినాదంతో..

అయోధ్య రాముడికి ముస్లిం యువకుడి స్పెషల్ గిఫ్ట్- 51 వేల మందికి ఉచితంగా టాటూలు

ABOUT THE AUTHOR

...view details