clay house India: ఈ ఇల్లు అరుదైన ఆయుర్వేద మూలికల సుగంధాన్ని వెదజల్లుతుంది. ఇంటికి కనీసం విద్యుత్తు సరఫరా కూడా లేదు. కానీ ఏసీ వంటి చల్లదనాన్ని ఇస్తుంది. 65కుపైగా ఆయుర్వేద మూలికలను మట్టితో కలిపి నిర్మించిన ప్రత్యేకమైన ఈ ఇల్లు కేరళ, పతనంతిట్ట జిల్లా అదూర్ మున్సిపాలిటీ పరిధిలోని నెల్లిముకల్ అనే గ్రామంలో ఉంది.
'మృన్మయమ్'గా పిలిచే ఈ ఇంటిని ఎర్నాకులానికి చెందిన జాకబ్ తంగచన్ అనే వ్యక్తి నిర్మించారు. ఇల్లు కట్టేందుకు మూలికలు, చేపల కొవ్వు ఉపయోగించడం విశేషం. ఇందుకోసం చేపలను ముందుగా ఓ ట్యాంకులో వేస్తారు. వాటి కొవ్వు నీటిలో చేరాక.. ఆ నీటిని మట్టి, మూలికలు కలిపేందుకు ఉపయోగిస్తారు.
మూలికలు కలగలిసిన మట్టితో నిర్మించిన ఈ ఇంటి లోపల ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని, కనీసం ఫ్యాన్ కూడా అవసరం లేదని చెబుతున్నారు యజమాని జాకబ్ తంగచన్. చల్లగా, సువాసనలు వెదజల్లుతూ, సేద తీరేందుకు అనువైన ప్రదేశంగా ఉంటుందని అంటున్నారు. ఒకే గది ఉన్న ఈ ఇంటిని నిర్మించేందుకు ఏడాదికిపైగా సమయం పట్టిందని తెలిపారు జాకబ్.