రాజస్థాన్ చురు జిల్లా కోలాసర్ గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూలులో.. 13ఏళ్ల విద్యార్థి గణేశ్ బుధవారం మరణించాడు. మనోజ్ అనే టీచర్.. గణేశ్‌ను దారుణంగా కొట్టడం వల్లే గణేశ్ ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. హోంవర్క్ చేయలేదన్న కారణంతో మనోజ్ కోపం తెచ్చుకున్నట్టు సమాచారం.
ఏం జరిగింది?
సాలాసర్ పోలీసుల కథనం ప్రకారం.. 7వ తరగతి చదువుతున్న గణేశ్ ఎప్పటిలాగే బుధవారం పాఠశాలకు వెళ్లాడు. అయితే అతను హోంవర్క్ చేయలేదని మనోజ్‌కు తెలిసింది. దీంతో ఉదయం 9:15 ప్రాంతంలో మనోజ్ గణేశ్ దగ్గరకు వెళ్లాడు. అందరు చూస్తుండగానే మనోజ్ తలను నేలకేసి కొట్టాడు. గణేశ్ శరీరంపై పిడిగుద్దులతో విరుచుకపడ్డాడు. దీంతో గణేశ్ స్పృహ కోల్పోయాడు. ఇదంతా క్లాసులోని విద్యార్థుల సమక్షంలో జరిగింది. వారందరూ భయంతో వణికిపోయారు.
గణేశ్ ఎంతకీ లేకపోవడం వల్ల అతను మరణించినట్టు నాటకం ఆడుతున్నాడని మనోజ్ భావించాడు. ఈ విషయాన్నే గణేశ్ తండ్రి ఓంప్రకాశ్‌కు ఫోన్ చేసి చెప్పాడు. ఈలోగా.. గణేశ్ ముక్కు నుంచి రక్తం కారడాన్ని గమనించిన మనోజ్.. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆసుపత్రికి రాకముందే గణేశ్ ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.