నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినిపై పాఠశాలలోని మరుగుదొడ్డిలో అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. స్కూల్లో పనిచేసే వాచ్మెన్ లక్ష్మీనారాయణ్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ భోపాల్‌లోని కోహెఫిజా ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: ఎనిమిదేళ్ల వయసున్న బాధితురాలు ఆరు రోజులు క్రితం పాఠశాలలో కొత్తగా చేరింది. శుక్రవారం మధ్యాహ్న భోజన సమయంలో బాధితురాలు టాయిలెట్‌కు వెళ్లగా నిందితుడు ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. దీంతో బాధితురాలు ఏడ్చింది. తోటి విద్యార్థులు టీచర్‌కు సమాచారం అందించారు. ఏం జరిగిందని టీచర్ బాధితురాల్ని అడగ్గా.. 'పసుపు చొక్కా వేసుకున్న వ్యక్తి మరుగుదొడ్డిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని' బాధితురాలు తెలిపింది. దీంతో పోలీసులకు సమాచారం అందించగా వారు విచారణ ప్రారంభించి.. నిందితుడు లక్షీనారాయణ్ను అరెస్టు చేశారు. నిందితుడు పోలీసు ఎదుట తాను చేసిన తప్పును అంగీకరించాడు.