Gang Rape On Tenth Class Girl: తమిళనాడులో దారుణ ఘటన వెలుగుచూసింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని అదే పాఠశాలకు చెందిన మరో ముగ్గురు విద్యార్థులు సామూహిక అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా జరిగిన దారుణాన్ని వీడియో తీసి.. స్నేహితులకు షేర్ చేశారు. ఆ తర్వాత మరో విద్యార్థి.. బాధితురాల్ని ఆ వీడియో చూపించి బెదిరించాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు.. నలుగురు మైనర్లను అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది..కడలూరు జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక చెన్నై ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అదే స్కూల్లో 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తన పుట్టినరోజున(మే 22) ఫ్రెండ్స్ అందరినీ తన ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చాడు. ఆ రోజు జరిగిన పార్టీకి బాధితురాలు కూడా వెళ్లింది. కేక్ కటింగ్ అనంతరం ప్రధాన నిందితుడు.. బాధిత బాలికతో ఫొటో దిగాడు. అది జరిగిన కొన్ని రోజుల తర్వాత అతడు జులై 1న చెన్నైకు వెళ్లాడు.
అక్కడకి వెళ్లాక బాధిత బాలికకు కాల్ చేసి.. 'నీతో దిగిన ఫొటో నా దగ్గర ఉంది. మీ ఇంటికి తెచ్చి ఇవ్వాలా? లేదా నా దగ్గర వస్తే ఇస్తాను' అని చెప్పాడు. అయితే బాధితురాలు.. పాఠశాల మధ్యాహ్న భోజన విరామంలో విద్యార్థి ఇంటికి వెళ్లింది. ఆమె ఇంట్లోకి రాగానే గడియ పెట్టేశారు మరో ఇద్దరు విద్యార్థులు. అనంతరం ముగ్గురు విద్యార్థులు కలిపి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దారుణాన్ని సెల్ఫోన్లో వీడియో తీశారు. ఆ వీడియోను మిగతా స్నేహితులకు షేర్ చేశారు. కానీ బాధితురాలు తనపై జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పుకోవాలో తెలియక ఇంటికి వెళ్లిపోయింది.