భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు జస్టిస్ చంద్రచూడ్. ఈ మేరకు ఆయన పేరును ప్రతిపాదిస్తూ లేఖను అందించారు ప్రస్తుత సీజేఐ జస్టిస్ యూయూ లలిత్. మంగళవారం ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు లాంజ్‌లో న్యాయమూర్తుల సమక్షంలో అందించారు లలిత్. నవంబర్ 8న జస్టిస్ లలిత్ పదవీ విరమణ చేసిన తర్వాత నవంబర్ 9న తదుపరి సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2024 నవంబరు 10 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. 44 ఏళ్ల క్రితం ఈయన తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి 7 ఏళ్ల 5 నెలలపాటు ఆ పదవిలో కొనసాగారు. సుదీర్ఘకాలం కొనసాగిన సీజేఐగా రికార్డు సృష్టించారు.
కీలక తీర్పుల్లో భాగస్వామి
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆరేళ్ల కాలంలో పలు కీలక తీర్పుల్లో జస్టిస్ డి.వై.చంద్రచూడ్ భాగస్వామిగా ఉన్నారు. ఆధార్ బిల్లును మనీ బిల్లుగా రాజ్యాంగ విరుద్ధంగా ఆమోదించినట్లు జస్టిస్ కె.ఎస్.పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయానికి భిన్నంగా ప్రత్యేక తీర్పురాశారు. ఆ చట్టంలోని నిబంధనలు వ్యక్తిగత గోప్యత, గౌరవం, స్వతంత్రతను ప్రభావితం చేస్తాయని చెప్పారు. అలాగే నవ్‌తేజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఐపీసీ సెక్షన్ 377 రాజ్యాంగ విరుద్ధమని, సేమ్ సెక్స్ ఇంటర్‌కోర్స్ చట్టబద్ధమేనని పేర్కొన్నారు. సెక్షన్ 377 వలసవాదుల పాలనలో వచ్చిందని, అది ప్రాథమిక హక్కులు, సమానత్వం, భావప్రకటనా స్వేచ్ఛ, జీవితం, వ్యక్తిగత గోప్యతకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
మేజర్ అయిన వారికి వివాహం, మతం విషయంలో తమకు నచ్చినట్లు నడుచుకొనే స్వేచ్ఛ ఉంటుందని సాఫిన్ జహాన్ వర్సెస్ అశోకన్ కేఎం కేసులో తీర్పు చెప్పారు. 10-50 ఏళ్ల మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం నిషిద్ధం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని, అలాచేయడం వారి స్వతంత్రత, స్వేచ్ఛ, మర్యాదలను దెబ్బతీయడమేనని ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో స్పష్టంచేశారు. భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుల కిందకు వస్తుందని జస్టిస్ కె.ఎస్.పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2017 ఆగస్టులో ఏకగీవ్రంగా తీర్పునిచ్చిన 9 మంది సభ్యుల ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నారు. వ్యభిచారం నేరం కాదని జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మెజారిటీ తీర్పుతో ఏకీభవించారు. ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (చట్టం ముందు అందరూ సమానం), 15 (మతం, వర్ణం, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా వివక్షచూపడం నిషేధం), 21 (జీవితం, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ)కు విరుద్ధమని చెప్పారు. శతాబ్దాలుగా మహిళల అణచివేతకు దీన్ని ఉపయోగిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.