దేశంలోని న్యాయస్థానాల్లో మౌలిక వసతులు పెంపొందించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (CJI NV Ramana news) అభిప్రాయం వ్యక్తం చేశారు. అనేక కోర్టులు శిథిలావస్థకు చేరిన నిర్మాణాల నుంచి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. బాంబే హైకోర్టు ఔరంగబాద్ బెంచ్ అనుబంధ భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన(CJI NV Ramana news).. 'నేషనల్ జుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ' ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
"ఏ సమాజానికైనా న్యాయస్థానాలనేవి చాలా కీలకం. న్యాయస్థానాలపై ప్రజలకు ఉన్న విశ్వాసమే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద బలం. రాజ్యాంగ హక్కులకు కోర్టులు రక్షణ కల్పిస్తాయి. న్యాయస్థానాలకు మౌలిక సదుపాయాలు కల్పించడమనేది ఎప్పుడూ తర్వాతి ఆలోచనగానే ఉంది. న్యాయస్థానాలు శిథిలమైన భవనాల నుంచే పనిచేస్తాయనే భావన ఉండిపోయింది. మౌలిక సదుపాయాల కల్పన తాత్కాలికంగా, ప్రణాళికేతర పద్ధతిలో జరుగుతోంది. నేషనల్ జుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఏర్పాటు ప్రతిపాదనను తర్వాతి పార్లమెంట్ సమావేశాల్లో పరిగణనలోకి తీసుకోవాలని మంత్రిని కోరుతున్నా."
-జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ఔరంగబాద్‌లో ఆవిష్కరించిన న్యాయస్థాన భవన సముదాయం ప్రణాళిక 2011 నాటిదని జస్టిస్ ఎన్వీ రమణ (CJI NV Ramana news) గుర్తు చేశారు. ఇది పూర్తిగా అందుబాటులోకి రావడానికి పదేళ్లు పట్టిందని, ఇది ఆందోళనకరమైన విషయమని అన్నారు. సమర్థవంతమైన న్యాయవ్యవస్థ.. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుంచి న్యాయ మౌలిక వసతుల కల్పన విషయంలో దేశం ఈ సమస్య ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ ప్రజల్లో న్యాయస్థానాల పట్ల ఉన్న అపోహలను తొలగించాలని జస్టిస్ ఎన్వీ రమణ (CJI Justice Ramana) అన్నారు.
"నేరస్థులు, బాధితులే కోర్టులకు వెళ్తారన్న అపోహ ఉంది. తాము న్యాయస్థానాలను ఇంతవరకూ సందర్శించలేదని కొందరు ప్రజలు గొప్పగా చెప్పుకుంటారు. ఇలాంటి అపోహలను తొలగించడానికి ఇదే సరైన సమయం. సాధారణ ప్రజలు తమ జీవితంలోని ఏదో ఒక సందర్భంలో సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమయంలో కోర్టులకు వెళ్లకుండా ఉండటం సరికాదు. న్యాయవ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసమే ప్రజాస్వామ్యానికి బలం."