NV Ramana retirement date : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ ఇప్పటివరకు అనేక చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు, న్యాయ వ్యవస్థలో అందరి భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన పలు చర్యలు చేపట్టారు. అందుకే న్యాయవాదులు సహా దాదాపుగా ప్రతిఒక్కరూ ఆయన విశేష కృషిని ఎప్పటికప్పుడు ప్రశంసిస్తూనే ఉన్నారు. సీజేఐగా జస్టిస్ రమణ పదవీకాలం శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో తాజాగా కొందరు న్యాయవాదులు ఆయన పనితీరుపై స్పందించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..
అద్భుతంగా పనిచేశారు
"జస్టిస్ ఎన్.వి.రమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా అద్భుతంగా పనిచేశారు. అంచనాలను మించి ఫలితాలు రాబట్టారు. గొప్ప పనితీరుతో అందరి మెప్పు పొందారు. విభిన్న వేదికలపై మాట్లాడేందుకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. న్యాయ వ్యవస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని స్వతంత్రత, నిర్మొహమాటత్వంతో పాటు వాస్తవిక తత్వాన్ని చాటుకున్నారు. అద్భుతమైన ప్రగతిశీల దృక్పథం ఉన్న వ్యక్తి ఆయన. అందుకే న్యాయ వ్యవస్థ అవసరాలను వేగంగా తీర్చగలిగారు. న్యాయమూర్తుల నియామకం, మౌలికవసతుల కల్పనలో జాప్యానికి అణు మాత్రమైనా చోటివ్వలేదు. శుభాభినందనలకు ఆయన సంపూర్ణంగా అర్హుడు. సుప్రీం కోర్టులో న్యాయవాదులంతా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ప్రత్యామ్నాయ పరిష్కార వేదిక అయిన మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడానికి జస్టిస్ రమణ విశేష కృషి చేశారు. కోర్టులు పనిభారంతో సతమతమవుతున్న సమయంలో హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం గొప్ప విషయం. అత్యున్నత న్యాయస్థానం కొలీజియం ద్వారా చేసిన న్యాయమూర్తుల నియామక సిఫార్సులు వేగంగా కార్యరూపంలోకి రావడంలో ఆయన కృషి అపారం. న్యాయ వ్యవస్థ అవసరాలను తీర్చడంలో జస్టిస్ రమణ చొరవను చూసి ప్రభుత్వం కూడా సహకరించింది. ఆర్టికల్ 370 రద్దు, ఆంధ్రప్రదేశ్ విభజన వంటివి చర్చనీయాంశాలే తప్ప.. వాటిని వెనక్కి మళ్లించడం సాధ్యం కాదు. అందుకే అలాంటి విషయాల జోలికి వెళ్లకుండా.. పూర్తి వాస్తవిక దృక్పథంతో వ్యవస్థను సరిదిద్దేందుకు జస్టిస్ రమణ ప్రయత్నించారు. తక్షణ అవసరాలపై దృష్టిసారించారు."
- జి.వి.రావు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది (మాజీ ఎన్నికల కమిషనర్ జి.వి.జి.కృష్ణమూర్తి కుమారుడు)
తెలుగువారి పేరు నిలబెట్టారు
"జస్టిస్ ఎన్.వి.రమణ మంచి పరిపాలనా దక్షుడు. సాధ్యమైనంతవరకూ అందరికీ మంచి చేయాలన్నదే ఆయన తత్వం. బలంగా ఉన్న ప్రభుత్వ హయాంలో పనులు చేయించుకోవడం అంత సులభం కాదు. అయితే జస్టిస్ రమణకు పరిపాలనా దక్షత ఉంది కాబట్టి అనుకున్నది అనుకున్నట్లుగా చేయించుకోగలిగారు. ఆయన అందరితో బాగున్నారు. మంచి పేరు తెచ్చుకున్నారు. పరిపాలనాపరంగా అత్యుత్తమ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఈయన పేరును చెప్పొచ్చు. ప్రజల్లో న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని జస్టిస్ రమణ పెంచారు. ఆయన తెలుగు విశిష్టత గురించి పదేపదే మాట్లాడటం నాకు బాగా నచ్చింది. మన అస్తిత్వం మాతృభాషతోనే ముడిపడి ఉంది. ఇప్పటితరం పిల్లలకు తెలుగు చదవడం, రాయడం రావడం లేదు. దానివల్ల మన మూలాలను పోగొట్టుకుంటామని ఆయన ప్రతిచోటా ప్రజలను చైతన్యపరిచేలా మాట్లాడడం సంతోషం కలిగించింది. మాతృభాష రాని పిల్లలకు మన మూలాలపై అభిమానం ఉండదన్న విషయం ఆయన మాటలతో ఇటీవల నాకు బాగా అర్థమైంది. జస్టిస్ రమణ తన ఇంటి ముందు తెలుగులో బోర్డు ఏర్పాటుచేసుకోవడంతో పాటు అధికారిక కార్యక్రమాల్లోనూ తెలుగు భాషను, మూలాలను గుర్తుచేయడం గొప్ప విషయం. ఇటీవల ఆయన రావిశాస్త్రి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొని గొప్పగా మాట్లాడారు. అధికారిక కార్యక్రమాల కోసం విదేశాలకు వెళ్లిన ప్రతిసారీ తెలుగు సంఘాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయన అన్ని విషయాల్లో నిర్భయంగా వ్యవహరించారు. హైదరాబాద్‌లో మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఏర్పాటుచేసిన ఘనత జస్టిస్ రమణకే దక్కుతుంది. సీజేఐగా వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని తెలుగువారి పేరును ఆయన నిలబెట్టారు. గతంలో ఎంతోమంది తెలుగువారు న్యాయమూర్తులుగా పనిచేసినప్పటికీ వారు బాహ్య ప్రపంచంతో అనుబంధాన్ని జస్టిస్ రమణ స్థాయిలో కొనసాగించలేకపోయారు."
-డి.రామకృష్ణారెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది
క్లిష్ట సమయంలోనూ వ్యవస్థను విజయవంతంగా నడిపారు
"సీజేఐగా జస్టిస్ రమణ పదవీకాలంలో అత్యధిక భాగం దురదృష్టవశాత్తూ కొవిడ్ విజృంభణ సమయంలోనే గడిచిపోయింది. అయితే ఇంత సంక్లిష్ట సమయంలోనూ కోర్టులను ఆయన చక్కగా నడిపించారు. వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా అనేక కేసుల విచారణ చేపట్టారు. తాను చేయాలనుకున్న నియామకాలన్నీ పూర్తిచేశారు. తొలిసారి ఆయన హయాంలో ఒకరోజు సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులూ పనిచేశారు. జస్టిస్ రమణ పరిపాలనా వ్యవహారాలను చాలా చక్కగా నిర్వహించగలిగారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ తన మనసులో మాటలను నిర్మొహమాటంగా చెప్పారు. కొత్తగా నిర్మించిన ఛాంబర్లను న్యాయవాదులకు కేటాయించారు. ఏ లక్ష్యాలను సాధించాలనుకున్నారో వాటన్నింటినీ సాధించారు. అత్యంత క్లిష్ట సమయంలోనూ వ్యవస్థను విజయవంతంగా నడిపించారు."
- దీపక్ నర్గోల్కర్, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్