CJI NV Ramana news: రాజకీయ వ్యతిరేకత శత్రుత్వంగా మారడం ఆదర్శ ప్రజాస్వామ్యానికి సంకేతం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య పరస్పర గౌరవం ఉండాలని.. కానీ ప్రస్తుతం అది తగ్గిపోతోందని జస్టిస్ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ నిర్వహించిన కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కార్యక్రమంలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శాసనవ్యవస్థల పనితీరుపైనా జస్టిస్ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. వివరణాత్మక చర్చలు, పరిశీలనలు లేకుండానే చట్టాలు ఆమోదం పొందుతున్నాయని పేర్కొన్నారు.
అంతకుముందు.. జైపుర్లో నిర్వహించిన ఆల్ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీ 18వ సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రసంగించిన జస్టిస్ రమణ.. నేర న్యాయవ్యవస్థలో సమర్థతను పెంచాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ జైళ్లలో 6.10 లక్షల మంది ఖైదీలు ఉన్నారని.. అందులో 80 శాతం మంది కేసుల విచారణ ఎదుర్కొంటున్నారని తెలిపారు. 'క్రిమినల్ జస్టిస్ సిస్టమ్లో న్యాయ ప్రక్రియే శిక్షగా మారిపోయింది. అసంబద్ధంగా అరెస్టులు చేయడం నుంచి.. బెయిల్ పొందడంలో ఇబ్బందుల వరకు.. సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియ విచారణలో ఖైదీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దృష్టిసారించాల్సి ఉంది. నేర న్యాయవ్యవస్థలో పాలనపరమైన సమర్థతను పెంచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం' అని జస్టిస్ రమణ పేర్కొన్నారు.
'అలా ఉండకూడదు'
అయితే, నేర న్యాయ వ్యవస్థ సమర్థత పెంచేందుకు రూపొందించే కార్యాచరణ.. విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ముందస్తుగా విడుదల చేసే లక్ష్యంతో ఉండకూడదని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. 'విచారణ పూర్తికాకుండానే పెద్ద సంఖ్యలో ఖైదీలు జైళ్లలో ఉంటున్నారు. ఎందుకు ఈ ప్రక్రియ ఇంత ఆలస్యంగా జరుగుతోందనే విషయంపైనే ప్రధానంగా దృష్టిపెట్టాలి' అని చెప్పారు.
'మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలి'
హైకోర్టులు, కిందిస్థాయి కోర్టుల్లో వాదనలు స్థానిక భాషల్లో జరిగేలా చూడాలని న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు పిలుపునిచ్చారు. మాతృభాషలు ఆంగ్లానికి తక్కువ అని పరిగణించకూడదని స్పష్టం చేశారు. 'సుప్రీంకోర్టులో వాదనలు ఆంగ్లంలో జరిగినా.. హైకోర్టులు, కింది స్థాయి కోర్టుల్లో ప్రాంతీయ, స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆంగ్లంలో అనర్గలంగా వాదించలేని న్యాయవాదులు ఉన్నారు. వారికి తమ సొంత భాషలో మెరుగ్గా వాదించగలిగే సామర్థ్యం ఉంది. ఇంగ్లిష్ బాగా మాట్లాడితే ఎక్కువ గౌరవం, ఎక్కువ ఫీజు వస్తుందనే వాదనకు నేను వ్యతిరేకం. మాతృభాషతో మమేకమై మనం పెరిగాం. ఆంగ్ల భాషతో పోలిస్తే మాతృభాష తక్కువ అని ఎప్పుడూ అనుకోవద్దు' అని రిజిజు పేర్కొన్నారు. మరోవైపు, ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు మధ్య సమన్వయం ఉండాలని రిజిజు ఆకాంక్షించారు. తద్వారా ప్రజలకు న్యాయం అందించాలన్న లక్ష్యం ఆలస్యం కాదని అన్నారు.