తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మాతృభాషలో బోధిస్తేనే.. పిల్లల్లో విశ్వాసం' - పిల్లల బోధనపై ఎన్​వీ రమణ

CJI NV Ramana: మాతృభాషలో చదువుకుంటేనే పిల్లలు చాలా విశ్వాసంతో బతుకుతారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. తల్లులంతా పిల్లలకు మాతృభాషలోనే బోధించాలని మహిళా న్యాయవాదులకు హితవు చెప్పారు. 'మన ఆలోచనల్ని ప్రభావితం చేసేది మాతృభాషే కాబట్టి అందులో బోధన చాలా ముఖ్యం' అని తెలిపారు.

CJI NV Ramana
జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

By

Published : Dec 15, 2021, 5:17 AM IST

Updated : Dec 15, 2021, 6:24 AM IST

CJI NV Ramana: తల్లులంతా పిల్లలకు మాతృభాషలోనే బోధించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ మహిళా న్యాయవాదులకు హితవు చెప్పారు. మాతృ భాష ప్రాధాన్యతను నొక్కి చెబుతూ "తల్లి భాషలో చదువుకుంటేనే పిల్లలు చాలా విశ్వాసంతో బతుకుతారు. వారి భావ వ్యక్తీకరణ సరిగ్గా ఉంటుంది. ఎవరైనా మనల్ని ప్రశ్నించినప్పుడు మన మనసు తొలుత మన మాతృభాషలో అర్థం చేసుకుంటుంది. తర్వాత దాన్ని ఇతర భాషల్లోకి తర్జుమా చేసుకుంటుంది. మన ఆలోచనల్ని ప్రభావితం చేసేది మాతృభాషే కాబట్టి అందులో బోధన చాలా ముఖ్యం. పిల్లలకు ఏ విషయాన్నైనా వారి సొంత భాషల్లోనే చెప్పాలనే సిద్ధాంతాన్ని నేను బలంగా నమ్ముతాను" అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ గౌరవార్థం మంగళవారం రాత్రి మహిళా న్యాయవాదులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మాతృభాషలో తన అనుభవాలను వివరించారు.

"నేను తెలుగు పుస్తకాలు దాదాపు అన్నీ చదివాను. అదే నాకు గట్టి పునాది వేసింది. నేను 8వ తరగతిలో ఇంగ్లిష్‌ అక్షరాలు నేర్చుకోవడం మొదలు పెట్టాను. న్యాయశాస్త్రాన్ని ఇంగ్లిష్‌ మీడియంలో చదివాను. ఉన్నత చదువులకు తెలుగు అభ్యాసం బలమైన పునాది వేసింది"

-జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ఇదీ చూడండి:ఆంగ్లంపై సీజేఐ- సొలిసిటర్​ జనరల్​ మధ్య ఆసక్తికర సంభాషణ

'ఉత్సాహం చూపలేడం లేదు'

Cji on woman in judiciary system: న్యాయవ్యవస్థలో మహిళల పాత్రను ప్రస్తావిస్తూ... న్యాయశాస్త్ర విద్యపై మహిళలు ఆసక్తి చూపుతుండడం సంతోషకరమే అయినా, న్యాయవాదులుగా పనిచేయడానికి వారు ఉత్సాహం చూపలేడం లేదని జస్టిస్ ఎన్​.వి.రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర ఉద్యోగాలవైపు దృష్టి పెడుతున్నారని చెప్పారు. "ప్రస్తుతం కిందిస్థాయి కోర్టుల్లో 30% మంది, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో 10-11% మంది మహిళా న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. జడ్జిల పదవుల కోసం పేర్లను సిఫార్సు చేసినప్పుడల్లా ఒకరిద్దరు మహిళల పేర్లు ఉండేలా చూడాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు చెబుతూ వస్తున్నాం. కోర్టు గదుల్లో మహిళలకు అనువైన వాతావరణం ఉండటం లేదు. చాలా కోర్టుల్లో మరుగుదొడ్ల వంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాను" అని ఆయన తెలిపారు.

Justice hima kohli: న్యాయమూర్తులు కూడా విమర్శలను తట్టుకుంటూ ముందుకుసాగాలని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కోరారు. జస్టిస్‌ హిమా కోహ్లీ గురించి మాట్లాడుతూ ఆమె చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చినట్లు ప్రశంసించారు. ఆమెకు ఈ హోదా ఎవరి దయాదాక్షిణ్యాలతోనో వచ్చిందికాదని, అంతా కష్టార్జితమన్నారు. ఆమె ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఇందిరా బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'న్యాయవాద వృత్తిని వ్యాపారంగా చూడొద్దు'

Last Updated : Dec 15, 2021, 6:24 AM IST

ABOUT THE AUTHOR

...view details