భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ మానవీయ సంప్రదాయానికి తెరతీశారు. రెండు దశాబ్దాల క్రితం విడిపోయి, సుప్రీంకోర్టు వరకు వెళ్లిన దంపతులను తానే చొరవ తీసుకుని కలిపారు. విభేదాలు మరిచిపోయి భావిజీవితం గడిపేలా ఓ కుటుంబపెద్దలా వారికి సర్దిచెప్పారు. బుధవారం సుప్రీంకోర్టులో చోటుచేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా న్యాయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవల కాలంలో న్యాయప్రక్రియలో మధ్యవర్తిత్వం ప్రాధాన్యాన్ని నొక్కిచెబుతున్న సీజేఐ.. తన నేతృత్వంలోని ధర్మాసనమే వేదికగా ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పెళ్లయి, బిడ్డ పుట్టిన ఏడాదికే విడిపోయి సుప్రీంకోర్టును ఆశ్రయించిన కళ్లెం శ్రీనివాసశర్మ, శాంతి దంపతులను ఒక్కటి చేశారు.
వ్యక్తిగత చొరవ తీసుకొని...
సాధారణంగా సుప్రీంకోర్టులో న్యాయవాదులే తప్ప కక్షిదారులను విచారించే పద్ధతి లేకపోయినా ప్రధాన న్యాయమూర్తి వ్యక్తిగత చొరవ తీసుకొని భార్యాభర్తలిద్దర్నీ కోర్టు ముందుకు రమ్మని వారి మనోగతాలను తెలుసుకున్నారు. కలిసి ఉండాలన్న వారి మనోభావాలను అర్థం చేసుకొని ఆ మాటను ఒకరికొకరు చెప్పేలా ఒప్పించి ఒక్కటి చేశారు. బేషరతుగా భార్య, బిడ్డను చూసుకుంటానని కోర్టుకు ప్రమాణపత్రం సమర్పించాలని శ్రీనివాసశర్మను ఆదేశించారు. భర్త సరిగా చూసుకుంటే చాలు అంతకుమించి కావాల్సిందేమీ లేదని చెప్పిన భార్యకు అంతకుముందు భర్తపై పెట్టిన 498ఎ కింద పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని సూచించారు. ఇద్దరూ అందుకు అంగీకరించడం వల్ల రెండు వారాల గడువిచ్చి విచారణను వాయిదా వేశారు. ప్రధాన న్యాయమూర్తి సూచనలతో సహచర న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కూడా ఏకీభవించారు.
పూర్వాపరాలివీ..
ప్రస్తుతం గుంటూరు జిల్లా గురజాల డిప్యూటీ తహసీల్దార్‌గా ఉన్న కళ్లెం శ్రీనివాస శర్మకు 1998లో శాంతితో వివాహమైంది. 1999లో కుమారుడు పుట్టాడు. ఇంట్లో గొడవల కారణంగా 2001లో విడిపోయారు. భర్త, ఆయన కుటుంబసభ్యులు తనపై దాడి చేశారంటూ శ్రీనివాసశర్మ, ఆయన సోదరి, తల్లిపై శాంతి 498ఎ కింద కేసు పెట్టారు. కేసును విచారించిన గుంటూరు 6వ అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ శ్రీనివాస శర్మకు ఏడాది జైలు, వెయ్యి రూపాయల జరిమానా విధించారు. మిగిలిన నిందితులను నిర్దోషులుగా విడుదల చేశారు. గుంటూరులోని ఫస్ట్ అప్పిలేట్ కోర్టు కూడా ఆ శిక్షను ఖరారు చేసింది. శ్రీనివాసశర్మ 2010లో హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆ శిక్షను తగ్గిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ శాంతి 2011లో సుప్రీంకోర్టుకెళ్లారు. అయితే భార్యాభర్తల మధ్య విడాకులు మంజూరు కానందున మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోమని సూచిస్తూ సర్వోన్నత న్యాయస్థానం కేసును 2012లో హైకోర్టు మీడియేషన్ సెంటర్‌కు పంపింది. అక్కడ సయోధ్య కుదరకపోవడం వల్ల కేసు మళ్లీ సుప్రీంకోర్టు ముందుకొచ్చింది.
తెలుగులోనే..
ఫిబ్రవరి 18న ఈ కేసు జస్టిస్ ఎన్‌వీ రమణ ధర్మాసనం వద్దకు వచ్చింది. 2001 నుంచి భార్యాభర్తలు విడిగానే ఉన్నా ప్రతివాది శ్రీనివాసశర్మ భార్యాబిడ్డ కోసం నెలవారీగా మెయింటెనెన్స్ ఇస్తున్నారని, ఇప్పుడు ఆయన శిక్షను పెంచి జైలుకు పంపితే ఉద్యోగం పోతుంది, దానివల్ల భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వడం సాధ్యం కాదని న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దానివల్ల ఇద్దరూ నష్టపోతారని చెప్పారు. మంగళవారం ఈ కేసు ధర్మాసనం ముందుకొచ్చినప్పుడు ఈ వివాదాన్ని ఇద్దరి అంగీకారంతో పరిష్కరిద్దామని సీజేఐ న్యాయవాదులకు చెప్పి, బుధవారం నాటికి ఇద్దర్నీ వీడియో కాన్ఫరెన్స్‌లోకి రమ్మని సూచించారు. ఇద్దరూ ధర్మాసనం ముందుకు రావడం వల్ల వారితో ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. తనతోపాటు ఉన్న మరో న్యాయమూర్తికి అర్థమయ్యేందుకు వీలుగా ఆంగ్లంలో మాట్లాడగలరా? శాంతిని అడిగారు. తమకు తెలుగు తప్ప మరో భాష రాదని చెప్పగా.. జస్టిస్ ఎన్‌వీ రమణ సహచర న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అనుమతితో వారితో తెలుగులో మాట్లాడారు. ఆ సారాంశాన్ని ఆయనకు అనువదించి చెప్పారు.
సంభాషణ ఇలా..
- ప్రధాన న్యాయమూర్తి: మీ భార్యాభర్తల మధ్య తగాదాలున్నాయని 2001లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. మీ ఆయన్ను జైలుకు పంపాలంటే పంపుతాం. రెండు, మూడు నెలలో.. నాలుగు నెలలో జైల్లో ఉండి తర్వాత బయటికొస్తారు. జైలుకెళ్లడంతో ఆయన ఉద్యోగం పోతుంది. తద్వారా మీకు వచ్చే మెయింటనెన్స్ కూడా రాదు. ఇప్పుడు మీకేం కావాలి? ఆయన జైలుకెళ్లడమా? మీకు మెయింటనెన్స్, ఇతర అంశాలా?
- పిటిషనర్ శాంతి:నాకు డబ్బులొద్దు. అవి నాకు భర్తను, నా బిడ్డకు తండ్రిని తెచ్చిపెట్టలేవు. గడిచిపోయిన 20 ఏళ్ల జీవితాన్ని కూడా తెచ్చిపెట్టలేవు.
- ప్రధాన న్యాయమూర్తి: మరేం చేద్దాం. మీరు ఆయనతో ఉంటారా?
- శాంతి: ఉంటాను సర్.
- ప్రధాన న్యాయమూర్తి: కలిసి ఉంటారా? విడాకులు కూడా వద్దంటారా?
- శాంతి: నాకు విడాకులు కూడా వద్దు సర్.
- ప్రధాన న్యాయమూర్తి: ఈ అప్పీల్‌లో శిక్ష పడితే ఆయన జైల్లో ఉంటారు కదా?
- శాంతి:ఆయనలో మార్పు వచ్చి.. నన్ను, నా బిడ్డను సరిగా చూసుకుంటానంటే నేను కేసు ఉపసంహరించుకుంటాను సర్.
- ప్రధాన న్యాయమూర్తి: (ప్రతివాది తరఫు న్యాయవాది రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి) మీ క్లయింట్ ఆమెను చేరదీసి దాంపత్య జీవితం కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారా?
- రామకృష్ణారెడ్డి:కేసు ఉపసంహరించుకుంటూ ఆమె కోర్టుకు దరఖాస్తు చేయనివ్వండి. భార్యతో కలిసి ఉండటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు.
- ప్రధాన న్యాయమూర్తి: ఆ తర్వాత మీ క్లయింట్ ఆమెను సరిగా చూసుకోవాలి.
- రామకృష్ణారెడ్డి:కచ్చితంగా సర్. తెలుగు రాష్ట్రాల్లో ఈ నేరంపై ఫిర్యాదు ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంది. ఆమె కేసును ఉపసంహరించుకొని భర్తతో కలిసి ఉండొచ్చు.
- జస్టిస్ సూర్యకాంత్:ఎలాంటి షరతులూ లేకుండా భార్యతోపాటు, కుమారుణ్ని చేరదీసి చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని భరోసా ఇస్తూ ప్రమాణపత్రంతో కలిపి ఆయనే దరఖాస్తు చేయాలి. దాన్ని ఆమోదిస్తూ భార్య కూడా తాను కేసును ఉపసంహరించుకుంటున్నట్లు అఫిడవిట్ వేయాలి.
- రామకృష్ణారెడ్డి: ఆ మేరకు మేం ఈ కోర్టుకు అఫిడవిట్ సమర్పిస్తాం.
- జస్టిస్ సూర్యకాంత్: ఈ కేసులో భర్తకు శిక్షపడింది. అందువల్ల ఆయన అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీరు భేషరతుగా వారిని స్వీకరించడానికి వస్తే తప్ప పరిస్థితులు కుదుటపడవు.
- రామకృష్ణారెడ్డి:ఎలాంటి షరతులు లేకుండా ఆమెతో కలిసి ఉంటారని ప్రమాణపత్రం దాఖలు చేస్తాం.
- ప్రధాన న్యాయమూర్తి: మీరేమంటారు?
- శాంతి: ఏ ఇబ్బందులు లేకుండా నన్నూ, నా బిడ్డనూ చూసుకుంటే మాకు సమ్మతమే సర్.
- ప్రధాన న్యాయమూర్తి: ఇబ్బందులన్నవి ఇద్దరి మధ్య అవగాహనను బట్టి ఉంటాయమ్మా. కోర్టు ఉత్తర్వులున్నాయి కదా అని చిన్న, పెద్ద విషయాలకు మళ్లీ ఇబ్బంది పెడితే...
- శాంతి: నేను అలా ఏమీ చేయను.
- ప్రధాన న్యాయమూర్తి: మీరు కూడా అలా ఒక అఫిడవిట్ ఇవ్వండి. చిన్నచిన్న విషయాలకు గొడవ పడకుండా, పరస్పరం అర్థం చేసుకొని ఒకర్నొకరు చూసుకోవాలి. జరిగిపోయినవి జరిగిపోయాయి. 20 ఏళ్లు కష్టపడ్డారు. అంతకుమించి ఏమీ లేదు. కనీసం బిడ్డ కోసమైనా చక్కగా ఉండండి. శర్మగారూ మీరు ఇకనైనా సరిగా ప్రవర్తించండి. భార్యను వేధించకండి.
ఇదీ చూడండి:తెలుగుపై మమకారం- మాతృ భాషంటే ప్రాణం
ఇదీ చూడండి:మాతృభాష.. జాతి ఔన్నత్యానికి ప్రతీక : జస్టిస్ ఎన్.వి.రమణ