CJI Justice NV Ramana: ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంలోనే మన స్వేచ్ఛ ఉంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. రాజ్యాంగం చెప్పిన ప్రజాస్వామ్య విధానం కంటే ఎవరూ ఎక్కువ కాదన్న ఆయన.. ప్రజాస్వామ్యంపై ఆధిపత్యం చలాయించాలని ఎవరూ చూడకూడదని సూచించారు. నేరాల నిరోధానికి పోలీసులు నిస్పక్షపాతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రారంభ దశలో సీబీఐపై ప్రజల్లో ఎంతో నమ్మకం ఉండేదన్న సి.జె.ఐ.. నిస్పాక్షికత, స్వతంత్రత విషయంలో సీబీఐ ప్రతీకగా నిలిచేదని అన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) వ్యవస్థాపక డైరెక్టర్ డీపీ కోహ్లీ 19వ స్మారకోపన్యాసం చేశారు సీజేఐ. ప్రజాస్వామ్యంలో దర్యాప్తు సంస్థల పాత్ర, బాధ్యతలపై ప్రసంగించారు. అందరి విషయంలో చట్టం సమానంగా అమలు చేయడం పోలీసుల విధి అని, బాధితులకు న్యాయం అందించడంలో చట్టం అమలు అంతర్భాగమన్నారు. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
" పోలీసులు, దర్యాప్తు సంస్ధలు సహా అన్ని వ్యవస్ధలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండడం సహా వాటిని బలోపేతం చేయడం అవసరం. ఎలాంటి అధికారిక వ్యవస్ధల జోక్యానికి అవి అవకాశం ఇవ్వరాదు. పోలీసులు నిస్పక్షపాతంగా పని చేసి, నేర నిర్మూలనపై దృష్టి సారించాలి. సమాజంలో శాంతి భద్రతలు వెల్లివిరిసేలా పోలీసులు.. ప్రజలను సమన్వయం చేసుకుంటూ పని చేయాలి. కాలానుగుణంగా రాజకీయ, కార్యనిర్వహక వ్యవస్థలు మారుతూ ఉంటాయి. కాని ఓ వ్యవస్ధగా మీరు శాశ్వతంగా ఉంటారు. పోలీసులు ధృడంగా, స్వతంత్రంగా ఉండాలి. మీ సేవలకు మద్దతు తెలపండి."