తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'న్యాయ వ్యవస్థపై నియంత్రణ తగదు'

సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు వ్యక్తం చేసే భావోద్వేగమైన అభిప్రాయాలకు న్యాయమూర్తులు ప్రభావితం కాకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ హెచ్చరించారు. బిగ్గరగా చేసే నినాదాలు, వాస్తవాలు అత్యధిక ప్రజల అభిప్రాయాలకు ప్రతిబింబం కాకపోవచ్చని.. స్వతంత్రంగా, బాహ్య ఒత్తిళ్లకు అతీతంగా నిలబడి పనిచేయడమే ముఖ్యమని స్పష్టం చేశారు. జస్టిస్‌ పి.డి.దేశాయ్‌ స్మారకోపన్యాసంలో పాల్గొన్న సీజేఐ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

Chief Justice Ramana
జస్టిస్‌ ఎన్‌.వి. రమణ

By

Published : Jul 1, 2021, 7:20 AM IST

ప్రభుత్వ అధికారాలు, చర్యలను తనిఖీ చేసే సమయంలో న్యాయ వ్యవస్థకు సంపూర్ణ స్వాతంత్య్రం ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ తెలిపారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల ద్వారా, చట్టాల రూపంలో న్యాయ వ్యవస్థను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగానో నియంత్రించరాదని అభిప్రాయపడ్డారు. అందుకు భిన్నంగా జరిగితే చట్టబద్ధ పాలన(రూల్‌ ఆఫ్‌ లా) ఓ భ్రమగానే మిగిలిపోతుందని పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం జస్టిస్‌ పి.డి. దేశాయ్‌ 17వ స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. 'చట్టబద్ధ పాలన' అనే అంశంపై ప్రసంగించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు వ్యక్తం చేసే భావోద్వేగమైన అభిప్రాయాలకు న్యాయమూర్తులు ప్రభావితం కాకూడదని హెచ్చరించారు. బిగ్గరగా చేసే నినాదాలు, వాస్తవాలు అత్యధిక ప్రజల అభిప్రాయాలకు ప్రతిబింబం కాకపోవచ్చన్న విషయాన్ని న్యాయమూర్తులు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. 'మంచి-చెడు, తప్పు-ఒప్పు, అసలు-నకిలీల మధ్య వ్యత్యాసాలను తెలుసుకోలేని విధంగా విషయాన్ని విపరీతంగా ప్రేరేపించే శక్తి నవీన మాధ్యమ సాధనాలకు ఉంది. అందువల్ల తీర్పులు వెలువరించడానికి మీడియా విచారణలు ప్రాతిపదిక కాకూడదు. స్వతంత్రంగా, బాహ్య ఒత్తిళ్లకు అతీతంగా నిలబడి పనిచేయడం అత్యంత ముఖ్యం' అని జస్టిస్‌ రమణ స్పష్టం చేశారు.

'అందుబాటులో న్యాయం..'

"చట్టం ముందు అందరూ సమానమే అంటే న్యాయం అందరికీ సమానంగా అందుబాటులో ఉండటమేనని అర్థం. మన దేశంలో చట్టబద్ధ పాలనకు ఇదే మూలసూత్రం. పేదరికం, నిరక్షరాస్యత, ఇతరత్రా బలహీనతల కారణంగా పేదలు తమ హక్కులను అనుభవించలేకపోతే సమానత్వ సిద్ధాంతానికి అర్థమే ఉండదు. స్త్రీ,పురుష సమానత్వం కూడా ముఖ్యమే. మహిళా సాధికారత కేవలం వారి హక్కుల కోసం పోరాడటానికే కాకుండా సమాజానికీ ముఖ్యం" అని జస్టిస్‌ ఎన్‌.వి. రమణ తెలిపారు.

రాజ్యాంగ బాధ్యతల సక్రమ నిర్వహణ

"దేశంలో ఇప్పటివరకు జరిగిన 17 సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీలు, కూటములను ప్రజలు 8 సార్లు తిరస్కరించారు. అంటే 50% ప్రభుత్వాలు మారిపోయాయి. విశాల దేశంలో ఎన్నో అసమానతలు, నిరక్షరాస్యత, వెనుకబాటుతనం, పేదరికం, అజ్ఞానం ఉన్నప్పటికీ స్వతంత్ర భారత పౌరులు వారికి అప్పగించిన పనిని అత్యంత బాధ్యతాయుతంగా, విజయవంతంగా పూర్తిచేశారు. కీలక వ్యవస్థలకు నేతృత్వం వహిస్తున్న వారు రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నామా? లేదా? అని పరీక్షించుకోవాలి. పరిపాలకుడిని మార్చినంత మాత్రాన దౌర్జన్యాల నుంచి రక్షణ లభిస్తుందన్న హామీ ఏమీలేదు. రాజకీయ విభేదాలు, విమర్శలు, నిరసనలు ప్రజాస్వామ్య ప్రక్రియలో అంతర్భాగం.

చట్టసభలు రూపొందించే చట్టాలు రాజ్యాంగ సూత్రాల ప్రకారం ఉండేలా చూసే ప్రాథమిక వ్యవస్థ న్యాయ వ్యవస్థే. దాని ప్రధాన విధి చట్టాలను సమీక్షించడమే. రాజ్యాంగ మూల సూత్రాల్లో భాగంగా సుప్రీంకోర్టు ఈ పని చేస్తోంది. దానిని పార్లమెంటు నియంత్రించలేదు. అయితే రాజ్యాంగాన్ని రక్షించే ప్రధాన బాధ్యత కేవలం కోర్టుల మీదే కాకుండా శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలపైనా ఉంది. న్యాయ వ్యవస్థ పాత్రకు పరిమితులున్నాయి. తన ముందుకొచ్చిన విషయాలను మాత్రమే అది పరిశీలించగలదు. ఈ పరిమితే రాజ్యాంగ విలువలను కాపాడే బాధ్యతలను మిగతా వ్యవస్థలకు అప్పగిస్తోంది" అని జస్టిస్‌ రమణ తెలిపారు. ప్రభుత్వాల మద్దతుతో రూపుదిద్దుకొనే ఏ చట్టమైనా కొన్ని ఆదర్శాలు, న్యాయసూత్రాలకు కట్టుబడి ఉండాలని, అలాంటి చట్టాల ప్రాతిపదికన పరిపాలన చేస్తున్నప్పుడే దాన్ని 'రూల్‌ ఆఫ్‌ లా'గా అభివర్ణించడానికి వీలవుతుందని స్పష్టం చేశారు.

తీర్పులే న్యాయమూర్తుల సత్తాకు కొలమానాలు

"తీర్పుల ద్వారా మాత్రమే న్యాయమూర్తుల గురించి తెలుస్తుంది. న్యాయమూర్తుల సత్తాను పరీక్షించడానికి తీర్పులే నిజమైన కొలమానాలు. న్యాయమూర్తులు వెలువరించే గొప్ప తీర్పులు ఎప్పటికీ న్యాయబద్ధంగా గుర్తుంటాయి" అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ జులై 4వ తేదీన పదవీ విరమణ చేయనున్న సందర్భంగా బుధవారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ ప్రసంగిస్తూ.. సుప్రీంకోర్టు సహచరుడిగా జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ అందించిన సేవలను కొనియాడారు. ఆయన గొప్ప మానవతావాది అని, ఆ లక్షణాలు ఆయన విధి నిర్వహణలో ఎప్పుడూ ప్రస్ఫుటమవుతుంటాయని పేర్కొన్నారు. 2016, మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌.. పలు చరిత్రాత్మక తీర్పుల్లో భాగస్వామి అయ్యారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details