ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకానికి కొలీజియం సిఫారసు చేసిన పేర్లకు సత్వరం ఆమోదం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(CJI of india). ప్రతి ఒక్కరికి సమానంగా న్యాయం అందేందుకు, ప్రజాస్వామ్యం బలోపేతానికి ప్రభుత్వ సహకారం, మద్దతును కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఈ ఏడాది మే నుంచి ఇప్పటి వరకు హైకోర్టులకు జడ్జీలుగా 106 మంది పేర్లను కొలీజియం సిఫారసు చేసినట్లు గుర్తు చేశారు సీజేఐ(CJI nv ramana news). వాటిని ఆమోదించటం ద్వారా పెండింగ్ కేసుల్లో చలనం వస్తుందని అభిప్రాయపడ్డారు.
నల్సా ఆధ్వర్యంలో దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన 'ద పాన్ ఇండియా లీగల్ అవేర్నెస్ అండ్ ఔట్రీచ్ క్యాంపెయిన్' కార్యక్రమంలో జడ్జీల నియామకంపై పలు విషయాలు వెల్లడించారు.
"జడ్జీల నియామకం కోసం కొలీజియం చేసిన పేర్లలో కొన్నింటికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మిగిలిన వాటికి ఒకటి, రెండు రోజుల్లో అనుమతి వస్తుందని న్యాయశాఖ మంత్రి హామీ ఇచ్చారు. కోర్టుల్లోని ఖాళీలను భర్తీ చేస్తూ.. ప్రజలకు త్వరగా న్యాయం అందేలా చేస్తున్న ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. కరోనా మహమ్మారి దేశ న్యాయవ్యవస్థలో పాతుకుపోయిన కొన్ని సమస్యలను వెలికితీసింది. అలాగే.. ప్రతి ఒక్కరికి సమానంగా న్యాయం అందటం, ప్రధానంగా నిరుపేదలకు న్యాయం సత్వరం అందించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపింది. త్వరగా న్యాయం అందేలా.. నేను, నా సహచర న్యాయమూర్తులు ప్రయత్నాలు చేస్తున్నాం. మే నెల నుంచి ఇప్పటి వరకు వివిధ హైకోర్టులకు 106 మంది జడ్జీలు, 9 మంది ప్రధాన న్యాయమూర్తులను సిఫారసు చేశాం. 106 మంది జడ్జీల్లో ఏడుగురు, తొమ్మిది మంది సీజేల్లో ఒకరికి ఆమోదం తెలిపింది ప్రభుత్వం. మిగిలిన వారికి సైతం ప్రభుత్వం త్వరగా క్లియరెన్స్ ఇస్తుందనే నమ్మకం ఉంది."
- జస్టిస్ ఎన్వీ రమణ, సీజేఐ
ప్రజాస్వామ్యం విరజిల్లేందుకు శక్తిమంతమైన న్యాయవ్యవస్థ అవసరమని పేర్కొన్నారు సీజేఐ(CJI nv ramana news). కరోనా మహమ్మారి న్యాయవ్యవస్థతో పాటు అన్ని రంగాల్లో సమస్యలు సృష్టించిందని, వేలాది కేసులు పేరుకుపోయినట్లు గుర్తు చేశారు. భారీ సంఖ్యలో ఖాళీలతో పాటు కరోనా కారణంగా కోర్టులు మూతపడటం, వర్చువల్గా నిర్వహించే సౌకర్యాలు లేకపోవటమూ అందుకు కారణంగా చెప్పారు.
ఇదీ చూడండి:హైకోర్టులకు మరో 16 మంది న్యాయమూర్తులు!