సివిల్ సర్వీస్ పరీక్ష.. ఎంతోమంది అభ్యర్థుల కల. దీన్ని సాధించడం అంత తేలిక కాదు. లక్షల మంది ప్రిలిమ్స్ రాస్తే.. చివరకు ఎంపికయ్యేది వందల్లోనే. దీన్ని సాధించాలంటే ఎంతో కృషి, పట్టుదలతో పాటు కఠోర శ్రమ అవసరం. ఇటీవల విడుదలైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ పరీక్ష-2021 ఫలితాల్లో తొలి మూడు ర్యాంకుల్లో అమ్మాయిలే మెరిసిన విషయం తెలిసిందే. శ్రుతి శర్మ టాప్ ర్యాంకు కైవసం చేసుకోగా, రెండు, మూడు స్థానాల్లో అంకితా అగర్వాల్, గామినీ సింగ్లా నిలిచి రికార్డు సృష్టించారు. అయితే, ఈ పరీక్ష ఎంత కష్టమో టాపర్లు సాధించిన మార్కులను బట్టి అర్థం చేసుకోవచ్చు. సివిల్స్‌కు ఎంపికైన వారు సాధించిన మార్కుల వివరాలను యూపీఎస్సీ గురువారం విడుదల చేసింది. తొలి ర్యాంకులో మెరిసిన శ్రుతిశర్మ 54.56శాతం మార్కులు సాధించగా.. 51.85 శాతం మార్కులతో అంకిత అగర్వాల్ రెండో ర్యాంకు సాధించారు. సివిల్స్-2021కు ఎంపికైన 685 మందిలో 508 మంది పురుషులు కాగా.. 177 మంది మహిళలు ఉన్నట్టు పేర్కొంది.
టాపర్లు సాధించిన మార్కులివే..
సివిల్స్ మెయిన్, ఇంటర్వ్యూలకు కలిపి మొత్తంగా 2025 మార్కులు ఉంటాయి. దీంట్లో మెయిన్/రాతపరీక్షకు 1750 మార్కులు, ఇంటర్వ్యూకి 275 మార్కులు చొప్పున కేటాయిస్తారు. అయితే, 2021 సివిల్స్ పరీక్షలో తొలి ర్యాంకు సాధించిన శ్రుతి శర్మ మొత్తంగా 1105 మార్కులు (రాత పరీక్షలో 932 మార్కులు, ఇంటర్వ్యూలో 173 మార్కులు) సాధించినట్టు యూపీఎస్సీ వెల్లడించింది. అలాగే, అంకిత అగర్వాల్ 1050 మార్కులు సాధించారని (రాతపరీక్ష 871, ఇంటర్వ్యూ 179 మార్కులు), మూడో ర్యాంకులో మెరిసిన గామినీ సింగ్లా 1045 మార్కులు (రాతపరీక్ష 858, ఇంటర్వ్యూ 187), నాలుగో ర్యాంకు సాధించిన ఐశ్వర్య వర్మ 1039 (రాత పరీక్ష 860, ఇంటర్వ్యూ 179 మార్కులు), ఐదో ర్యాంకులో మెరిసిన ఉత్కర్ష్ ద్వివేది 1036 (రాతపరీక్ష 871, ఇంటర్వ్యూ 165) మార్కులు చొప్పున సాధించినట్టు యూపీఎస్సీ వివరించింది.