తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విమానంలో రాబందు ప్రయాణం.. ఐదేళ్ల తర్వాత తమిళనాడు నుంచి రాజస్థాన్​కు.. - ఎయిర్​ ఇండియా విమానంలో రాబందు

విమానమెక్కిన రాబందు.. ఇది వినడానికి వింతగా ఉన్నా నిజం. ఓ విమానంలో ఓఖీ అనే రాబందును తమిళనాడు నుంచి రాజస్థాన్​కు తరలించారు. దాని కథ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

vulture in india
విమానమెక్కిన రాబందు

By

Published : Nov 4, 2022, 12:05 PM IST

2017లో తమిళనాడులో వచ్చిన ఓఖీ తుపాను వలన గాయపడిన ఓ పెద్ద రాబందు.. ఎగరలేని స్థితిలో అటవీ అధికారుల చెంతకు చేరింది. దాదాపు 5 సంవత్సరాల పాటు ఆ రాబందుకు ఆవాసం కల్పించిన తమిళనాడు అటవీ శాఖ అధికారులు.. గురువారం రాజస్థాన్​కు చేర్చారు. దాని ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఓ ప్రత్యేక బోనులో పెట్టి.. విమానంలో రాజస్థాన్​కు తరలించారు. త్వరలోనే ఇతర రాబందుల సమూహంతో కలపనున్నారు.

ఏంటీ రాబందు కథ?
2017లో ఓఖీ తుపాను తమిళనాడు తీరాన్ని తాకినప్పుడు.. వలస వచ్చిన ఓ పెద్ద రాబందు గాయపడి తన గుంపు నుంచి తప్పిపోయింది. దాన్ని గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అది ఓఖీ తుపాను కారణంగా గాయపడింది కనుక దానికి 'ఓఖీ' అని పేరు పెట్టారు. దాదాపు 5 సంవత్సరాల పాటు తమిళనాడులోని కన్యాకుమారిలో అటవీశాఖ సిబ్బంది దాన్ని సంరక్షించారు. ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడి.. ఎగరగలిగే స్థితికి చేరుకున్నందున ఆ రాబందును తిరిగి తన గుంపుతో కలపడానికి జోధ్​పుర్​కు గురువారం విమానంలో తరలించారు.

తమిళనాడు నుంచి రోడ్డు మార్గంలో 2300 కిలోమీటర్ల దూరంలోని జోధ్​పుర్​లో ఉన్న మాచియా బయోలాజికల్ పార్క్‌కు రాబందును తీసుకువెళ్లాలని అధికారులు తొలుత భావించారు. అయితే.. మరీ ఇంతటి దూర ప్రయాణం చేస్తే రాబందు ఆరోగ్యం దెబ్బతినవచ్చని అనుకున్నారు. అందుకే ఓఖీని ఓ బోనులో పెట్టి ఎయిర్ ఇండియా విమానంలో గురువారం మధ్యాహ్నం తరలించారు. దానితో పాటుగా కన్యాకుమారి పారెస్ట్​ ఆఫీసర్​ కూడా జోధ్​పుర్​కు వెళ్లారు.

'రాబందును ముందుజాగ్రత్త చర్యగా కొన్ని రోజులు నిర్బంధంలో ఉంచుతారు. ఆ తరువాత ఓఖీని తన గుంపుతో కలిసేందుకు విడిచిపెడతారు' అని మాచియా పార్క్ అటవీ సంరక్షణా అధికారి కేకే వ్యాస్ చెప్పారు.
'ఓఖీ అనే ఓ అందమైన రాబందు కథ అందరి హృదయాలను కలిచివేస్తుంది. 2017 ఓఖీ తుపానులో గాయపడిన ఓ రాబందు.. ఎయిర్ ఇండియా విమానం ద్వారా తమిళనాడు నుంచి రాజస్థాన్​కు తన గుంపుతో కలిసేందుకు పయనమైంది' అని తమిళనాడు అటవీశాఖా కార్యదర్శి సుప్రియా సాహూ ట్వీట్​ చేశారు.

ప్రపంచంలో అతిపెద్ద రాబందులుగా గుర్తింపు పొందిన ఇవి.. అక్టోబర్ నెలలో ఉజ్బెకిస్తాన్, మంగోలియా మీదుగా పోర్చుగల్, ఫ్రాన్స్ నుంచి భారతదేశానికి వస్తాయి. మరికొన్ని రోజుల్లో ఈ గుంపు జోధ్‌పుర్‌కు వచ్చినప్పుడు వాటితో పాటు ఈ ఓఖీని కూడా విడిచిపెడతామని అధికారులు తెలిపారు. రాజస్థాన్‌లో.. రాబందుల కోసం ప్రత్యేక పశువుల కళేబరాల డంపింగ్​ యార్డ్​లు కేరు అనే ప్రాంతంలో ఉన్నాయి. ఆ ప్రాంతానికి ఆ జాతి రాబందులు వస్తాయి. అందుకే.. కేరునే ఓఖీని విడిచి పెట్టడానికి అనువైన ప్రాంతమని రాజస్థాన్​ అటవీ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details