సినిమా థియేటర్లకు బయట నుంచి ఆహారం, పానీయాలు తీసుకురాకుండా ఆపే హక్కు హాల్ యజమానికి ఉందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. సినిమా హాల్.. యజమాని ప్రైవేట్ ఆస్తి అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ నరసింహతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే హాళ్ల యజమాన్యం ప్రేక్షకుడికి మంచినీటిని అందించాలని తెలిపింది.
"ప్రేక్షకులు బయట నుంచి ఆహారం, పానీయాలు థియేటర్లోకి తీసుకురాకుండా నియంత్రించే హక్కు సినిమా హాల్ యజమానికి ఉంది. అందుబాటులో ఉన్న స్నాక్స్, కూల్ డ్రింక్స్ కొనుగోలు చేయాలా? వద్దా అనేది ప్రేక్షకుడి ఇష్టం. హాల్లో కచ్చితంగా తినుబండారాలు కొనాలన్న నిబంధనేమీ లేదు. కాబట్టి ప్రేక్షకులు అవసరమైతేనే స్నాక్స్ కొనుగోలు చేస్తారు. అది వారి ఇష్టం."