Cigarette Offering Temple in Karnataka :ఏ గుళ్లో అయినా.. దేవుడికి కొబ్బరికాయలు కొట్టి, అగరబత్తులు వెలిగిస్తుంటారు. కానీ కర్ణాటక బెళగావిలో ఉన్న ఆలయంలో మాత్రం అమ్మవారికి సిగరెట్లు వెలిగించి పూజలు చేస్తున్నారు. తమ శక్తిమేర మద్యాన్ని కొనుక్కొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఈ ఆలయంలో పూజలు చేసేది హిజ్రాలు కావడం ఇక్కడి మరో ప్రత్యేకత.
Karnataka Belagavi Cigarette Temple :సిగరెట్లు, మద్యంతో పూజలు జరుగుతున్న ఆలయం జిల్లాలోని గోకక్ తాలుకా, కదబగట్టి హిల్ ప్రాంతంలో ఉంది. శ్రీ చౌదేశ్వరీ దేవి ఆలయంలో ఇలా వినూత్న పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకొని తమ కోరికలు తీర్చాలంటూ భక్తులు.. ఆలయంలోని చెట్టుకు కొబ్బరికాయలతో ముడుపులు కడతారు. అనుకున్నవి నెరవేరగానే.. పువ్వులు, ఫలాలు, నూనె, కొబ్బరికాయలతో పాటు మద్యం, సిగరెట్లను అమ్మవారికి సమర్పించుకుంటారు. శుక్రవారం 'జాతర మహోత్సవం' నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివచ్చారు.
నాగుల పంచమికి నిజమైన పాముకు పూజలు.. ఇంటికి తీసుకొచ్చి హారతి.. దండలతో అలంకరణ!
ఆలయంలో పూజలందుకునే చౌడేశ్వరీ దేవి సర్పంపై కూర్చొని ఉంటుంది. ప్రతి ఏటా జోకుమార పౌర్ణమి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా అమ్మవారిని బంగారు ఆభరణాలు, సకల పుష్పాలతో అలంకరిస్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆ రోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. సత్యప్ప అనే ట్రాన్స్జెండర్ 26 ఏళ్లుగా ఈ ఆలయంలో పూజలు చేస్తున్నారు.
"26 ఏళ్లుగా ఇక్కడ జాతర నిర్వహిస్తున్నాం. కోరిక తీరిన తర్వాత తమకు తోచిన విధంగా మద్యం, సిగరెట్లు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. పిల్లలు లేనివారికి అమ్మవారే సంతానం ప్రసాదించింది. ఇక్కడి అమ్మవారు చాలా శక్తివంతమైనది."
-సత్యప్ప, ఆలయ పూజారి