CID Custody for Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ కేసులో.. రెండు రోజుల పాటు చంద్రబాబును విచారించనున్న ఏపీ సీఐడీ CID Custody for Chandrababu: చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ.. ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో (Skill Development Case) ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండులో ఉన్న చంద్రబాబుని.. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం ప్రాంగణంలోనే విచారించాలని సూచించింది.
శని, ఆదివారాలలో ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని, గంటకోసారి అయిదు నిమిషాల విరామం ఇచ్చి.. న్యాయవాదిని సంప్రదించుకునేందుకు అవకాశమివ్వాలని తెలిపింది. చంద్రబాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని.. ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. కస్టడీకి తీసుకునే ముందు.. ముగిసిన తర్వాత ఆయనకు తప్పనిసరిగా వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.
AP High Court Dismissed Chandrababu Quash Petition: దర్యాప్తునకు ముందస్తు అనుమతి అవసరం లేదు.. చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత
విచారణను సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్‌తో మాత్రమే రికార్డు చేయించాలని, ఆ వీడియో మొత్తాన్ని సీల్డ్ కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించాలని పేర్కొంది. విచారణ సమయంలో చంద్రబాబు తరఫు న్యాయవాదిని.. విచారణ కనిపించే దూరం వరకూ అనుమతించాలని తెలిపింది. మధ్యాహ్నం గంటపాటు భోజన విరామమివ్వాలని.. విచారణ సమయంలో అవసరమైన వైద్య సదుపాయం కల్పించాలని స్పష్టం చేసింది. కస్టడీ గడువు ముగిశాక ఆదివారం సాయంత్రం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా చంద్రబాబును న్యాయస్థానం ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది.
వీడియోలు, ఫొటోలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు విడుదల చేయొద్దు: సిట్ కార్యాలయంలో చంద్రబాబును విచారించినప్పుడు సాక్షి కెమెరామన్, వీడియోగ్రాఫర్ చిత్రీకరించి వాటిని బయటకు విడుదల చేశారని చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పత్రికల క్లిప్పింగ్‌లను న్యాయస్థానానికి సమర్పించారు. దీంతో విచారణ వీడియోలు, ఫొటోలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు విడుదల చేయొద్దని న్యాయస్థానం సీఐడీని ఆదేశించింది. ఒడిశా మాజీ సీఎం నందినీ శత్పతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను విచారణ సమయంలో పాటించేలా.. సీఐడీని ఆదేశించాలని దమ్మాలపాటి విన్నవించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Chandrababu Judicial Remand Extended: చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ఈ నెల 24 వరకు పొడిగింపు
సీఐడీ విచారణ జరిగే సమయంలో చంద్రబాబు తరఫున హాజరయ్యేందుకు ఏడుగురు న్యాయవాదుల పేర్లను న్యాయస్థానానికి సమర్పించారు. వీలును బట్టి వారిలో ఎవరో ఒకరు హాజరవుతారని న్యాయస్థానానికి తెలపగా.. కోర్టు దానికి సమ్మతించింది. సీఐడీ తరఫున 9 మంది అధికారులు, వీడియోగ్రాఫర్, ఇద్దరు మధ్యవర్తులు సహా మొత్తం 12 మందితో బృందాన్ని.. దర్యాప్తు సంస్థ సిద్ధం చేసింది. ఆర్థిక నేరాల విభాగం-2 డీఎస్పీలు ధనుంజయుడు, విజయ భాస్కర్, లక్ష్మీనారాయణ.. ఇన్‌స్పెక్టర్లు మోహన్ కుమార్, రవి కుమార్, శ్రీనివాసన్, సాంబశివరావు.. ఎఎస్సై రంగనాయకులు, కానిస్టేబుల్ సత్యనారాయణ విచారణ బృందంలో ఉంటారని.. ACB కోర్టుకు సీఐడీ తెలిపింది.
వాటిపై విచారణ సోమవారమే: చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసు (Inner Ring Road Case), ఫైబర్‌గ్రిడ్ కేసుల్లో (Fiber Grid Case) సీఐడీ అధికారులు దాఖలు చేసిన పీటీ వారంట్ పిటిషన్లపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. బెయిలు పిటిషన్‌పై విచారణను శనివారం చేపట్టాలని దమ్మాలపాటి శ్రీనివాస్ కోరగా.. సోమవారం చేపట్టాలని ప్రభుత్వ న్యాయవాది వివేకానంద కోరారు. సోమవారమే బెయిలు పిటిషన్‌పై విచారణ జరిపి.. ఇరువైపుల వాదనలు వింటామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Lokesh to approach Supreme Court on Chandrababu case : 'స్కిల్' కేసులో దిల్లీ వేదికగా లోకేశ్ న్యాయపోరాటం..! సుప్రీంను ఆశ్రయించనున్న టీడీపీ