తెలంగాణ

telangana

By

Published : Jul 17, 2023, 9:02 AM IST

ETV Bharat / bharat

CI Anju Yadav Viral Video: తొడగొట్టిన సీఐ అంజూయాదవ్.. వైరల్ అవుతున్న వీడియో

CI Anju Yadav Viral Video: నడిరోడ్డుపై విపక్ష నాయకులపై చేయిచేసుకున్నా.. సాటి మహిళను బూటుకాళ్లతో తన్ని వివస్త్రను చేసి ఈడ్చుకెళ్లినా.. ఆ అధికారిణిపై ఎలాంటి చర్యలు ఉండవ్. కేవలం ఛార్జిమెమోతో సరిపెట్టేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ తొడగొట్టి సవాళ్లు విసురుతున్నా.. ఉన్నతాధికారులు కనీసం మందలిచ్చే సాహసం చేయడం లేదు. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌ అక్రమాలు, అవినీతిపై ఫిర్యాదులు ఉన్నా.. శాఖాపరమైన చర్యలకు పోలీసు శాఖ వెనకడుగు వేస్తోంది. అధికార పార్టీ అరాచకాలకు కొమ్ముకొస్తున్నందువలనే కిమ్మనడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

CI Anju Yadav Viral Video
సీఐ అంజు యాదవ్ వైరల్ వీడియో

అంజూయాదవ్ తొడగొట్టిన వీడియో

CI Anju Yadav Viral Video: అత్యంత వివాదాస్పద అధికారిణి, శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా.. ఆమెపై వైఎస్సార్​సీపీ ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఆమె వ్యవహారశైలితో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసినప్పుడు విచారణ పేరిట హడావుడి చేయడం.. ఆ తర్వాత ఆ వ్యవహారాన్ని వదిలేయడం పోలీసు శాఖకు పరిపాటిగా మారింది.

సామాన్యులతో దురుసుగా ప్రవర్తించటం, అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై చేయి చేసుకోవటం, మహిళలను కాలితో తన్నడం ఆమెకు రివాజుగా మారింది. వీటిపై ఎన్నో ఫిర్యాదులు వచ్చినా.. ఏ ఒక్క ఘటనలోనూ ఆమెపై చర్యలు తీసుకోలేదు. తాజాగా జనసేన నేతపై చేయి చేసుకోగా.. కేవలం ఆమె నుంచి వివరణ కోరుతూ ఛార్జిమెమో జారీ చేసి వదిలేశారు.

అంజూయాదవ్‌ వివాదాస్పద వ్యవహారశైలికి సంబంధించి అనేక ఆధారాలు సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి. హోటళ్ల ముందు తొడకొట్టటం, వెకిలి నవ్వులతో హెచ్చరించటం వంటి ఆమె దురుసు ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. కానీ పోలీసు ఉన్నతాధికారులకు ఇవేమీ పట్టడం లేదు.

జనసేన నేతపై చేయి చేసుకోవడంతో ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్వయంగా శ్రీకాళహస్తిలో ధర్నాకు దిగుతానని హెచ్చరించిన నేపథ్యంలో అంజూయాదవ్‌పై చర్యలు తీసుకోనున్నట్లు ప్రచారం జరిగినా.. కేవలం ఛార్జ్‌మెమో జారీతో సరిపెట్టారు. అంజూయాదవ్‌కు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఓ హోటల్‌ నుంచి మహిళను ఈడ్చుకెళ్లిన వీడియో వైరల్‌ కాగా.. అదే హోటల్‌ ముందు ఆమె తొడగొడుతూ గట్టిగా నవ్వుతున్న వీడియో తాజాగా వెలుగుచూసింది.

అత్యంత వివాదాస్పదమైన ఈ అధికారిణిపై గతంలోనూ ఆనేక ఆరోపణలు ఉన్నాయి. సత్యవేడులో ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో ఓ ఆర్ఎంపీపై చేయి చేసుకోగా.. ఆయన ప్రైవేట్ కేసు పెట్టారు. కింది కోర్టులో మూడు నెలల జైలు శిక్ష ఎదుర్కొన్న అంజూయాదవ్‌.. హైకోర్టును ఆశ్రయించారు. బాధితుడితో రాజీ కుదుర్చుకుని ఆ కేసు నుంచి ఆమె బయటపడ్డారు. తిరుపతిలో పనిచేస్తున్న సమయంలో తోటి ఉద్యోగులతో అనుచితంగా వ్యవహరించి శాఖాపరమైన విచారణ ఎదుర్కొన్నారు.

"మా మీద ఈ విధంగా కక్ష కట్టుకొని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తుంటే.. ఆమె నవ్వూతూ, తొడకొడుతూ నా మీద దౌర్జన్యం చేసింది. నా మీద దౌర్జన్యం చేయడమే కాకుండా.. పదో తరగతి చదువుతున్న నా కుమారుడిపై కూడా కేసు పెట్టింది. ఆ అబ్బాయి పరీక్షలు రాస్తుంటే.. ఎగ్జామ్ సెంటర్​లోకి వెళ్లి ఇబ్బంది పెట్టింది. ఈ విధంగా చేస్తూ.. మమ్మల్ని చాలా హింసించింది". - హరినాయుడు, బాధితుడు

ABOUT THE AUTHOR

...view details