లోక్ జనశక్తి పార్టీ(LJP) వ్యవస్థాపకుడు రాంవిలాస్ పాసవాన్ సోదరుడు పశుపతికుమార్ పరాస్ ఆ పార్టీపై తిరుగుబాటు అనంతరం బిహార్ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాబాయి తిరుగుబాటు తరువాత పార్టీలో ఒంటరిగా మారి.. భాజపా తనకు అండగా నిలబడలేదని అసంతృప్తిగా ఉన్న ఎల్‌జేపీ అధినేత చిరాగ్ పాసవాన్ రాష్ట్రీయ జనతాదళ్ (RJD)తో స్నేహంపై సంకేతాలిచ్చారు. బిహార్‌లో ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఆర్జేడీతో పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని చిరాగ్ పేర్కొన్నారు.
Bihar politics: ఆర్జేడీతో చిరాగ్ పొత్తు! - బిహార్ రాజకీయాలు
ఎల్‌జేపీ(LJP) నేత చిరాగ్ పాసవాన్.. రాష్ట్రీయ జనతాదళ్‌తో స్నేహంపై సంకేతాలిచ్చారు. ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఆర్జేడీతో పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. తన తండ్రి రాంవిలాస్ పాసవాన్, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ స్నేహితులని చిరాగ్ గుర్తుచేసుకున్నారు.
తన తండ్రి రాంవిలాస్ పాసవాన్, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ స్నేహితులని చిరాగ్ గుర్తుచేసుకున్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తాను కూడా మంచి మిత్రులమని.. తేజస్వీ తనకు చిన్న తమ్ముడి లాంటివారని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో తాను రాముడికి హనుమంతుడిలా అండగా ఉంటే.. ఆయన తనకు సాయం చేయలేదని చిరాగ్ ఆవేదన వ్యక్తం చేశారు. హనుమంతుడిపై రాజకీయ కుట్ర జరుగుతుంటే రాముడు మౌనంగా చూస్తూ ఉండబోరని నమ్ముతున్నట్లు చిరాగ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి :'కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ కూటమి అసాధ్యం'