బిహార్ ఎన్నికలకు ముందు.. ఎల్జేపీ అధినేత రామ్‌విలాస్ పాసవాన్ చనిపోగానే.. ఆయన కుమారుడు చిరాగ్ పాసవాన్(Chirag Paswan) పార్టీ పగ్గాలు చేపట్టారు. పాసవాన్ బతికున్నన్ని రోజులు తన తమ్ముళ్లను, కుటుంబ సభ్యులందరినీ బాగా చూసుకునేవారు. వారి కుటుంబ అవసరాలు కూడా ఆయనే తీర్చేవారు. అన్నదమ్ములందరి మధ్య మంచి అనుబంధం ఉండేది. తమ్ముడు పశుపతి కూడా అన్న రామ్ విలాస్ పాసవాన్ వెంటే ఉండేవారు. ఆయన బిహార్‌కు వచ్చారంటే.. అంతా పశుపతే చూసుకునేవారు.
ఇదీ చదవండి:చిరాగ్ ఏకాకి- దెబ్బకుదెబ్బ తీసిన నితీశ్!
నమ్మిన బంటు..
ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. తొలిసారి ఎంపీగా ఎంపికైన 71 సంవత్సరాల పశుపతి.. రామ్‌విలాస్‌కు నమ్మిన బంటు! అలాంటి బాబాయిని.. పార్టీ పగ్గాలు చేపట్టగానే చిరాగ్ పక్కనబెట్టారు. అంతేగాకుండా ఓ రోజు.. "నువ్వు నా రక్తసంబంధం కానేకావు" అంటూ పెద్దగా అందరి ముందు అరిచి అవమాన పరిచారు చిరాగ్!(Chirag Paswan) ఆ సందర్భంలో రామ్‌విలాస్ పాసవాన్ భార్య కూడా అక్కడే ఉన్నారు. ఆ క్షణంలోనే కన్నీరు పెట్టుకుంటూ "నీకు నీ చిన్నాన్న చచ్చిపోయాడనుకో" అంటూ అవమానాన్ని దిగమింగుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు పశుపతి! అంతేగాకుండా బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌ను మెచ్చుకుంటూ తానోసారి మాట్లాడితే.. చిరాగ్ పట్టుబట్టి మరీ ఆ మాటల్ని వెనక్కి తీసుకునేలా చేయటం కూడా పశుపతిలో ఆవేదన రగిల్చింది.
ఇప్పుడు.. పార్టీ పగ్గాలను తాను చేపట్టమే కాకుండా పార్టీ పీఠం నుంచి చిరాగ్‌ను తొలగించటం ద్వారా పశుపతి ఆనాడు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నారు. ఆనాడు తనను ఇంటి నుంచి వెళ్ళగొట్టిన చిరాగ్ ఇప్పుడు సంక్షోభ నివారణకంటూ సోమవారం తన ఇంటి ముందు తచ్చాడటం లోనికి వస్తానంటూ అనుమతి కోరటం గమనార్హం! అంతేగాకుండా చిరాగ్ తల్లి (రామ్‌విలాస్ పాసవాన్ భార్య) సోమవారం పశుపతికి ఫోన్ చేసి సర్దిచెప్పటానికి ప్రయత్నించారు.