తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫిబ్రవరి 5న సమతామూర్తిని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ

శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహానికి ప్రధాననమంత్రి నరేంద్ర మోదీని (PM Modi) ఆహ్వానించారు చిన్నజీయర్‌ స్వామీజీ(Chinna Jeeyar Swamy). వచ్చే ఏడాది జరిగే సమతామూర్తి విగ్రహావిష్కరణకు హాజరుకావాలని కోరారు. ఈ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మోదీ.. తప్పక హాజరవుతానని హామీ ఇచ్చారు.

MODI CHINNAJIYAR
'రామానుజాచార్య విగ్రహావిష్కరకు మోదీకి ఆహ్వానం'

By

Published : Sep 18, 2021, 5:17 PM IST

Updated : Sep 18, 2021, 11:16 PM IST

భగవత్‌ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా శంషాబాద్‌లోని చిన్నజీయర్‌ స్వామీజీ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సమతామూర్తిని 2022 ఫిబ్రవరి 5న ఆవిష్కరించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దిల్లీలో ప్రధాని నివాసంలో నరేంద్రమోదీని కలిసిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామీజీ... శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం ఆహ్వాన పత్రికను స్వయంగా అందించారు. సహస్రాబ్ది మహోత్సవాల విశిష్టతను ప్రధానికి వివరించారు. 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. చిన్నజీయర్‌ స్వామీజీతో పాటు.. మైహోం గ్రూప్‌ అధినేత డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు కూడా మోదీని కలిసి ప్రాజెక్టు విశేషాలను తెలియజేశారు.

సమతాస్ఫూర్తి కేంద్రం సహా స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ప్రతిబింబంగా ఏర్పాటు చేయనున్న 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ (ramanuja statue of equality) విశిష్టతను, అక్కడ కొలువుదీరనున్న 108 దివ్యదేశాల వివరాలను ఆసక్తిగా తెలుసుకున్నారు ప్రధానమంత్రి. ప్రపంచ శాంతి కోసం చిన్నజీయర్ స్వామి చేస్తున్న ఈప్రయత్నాన్ని అభినందించిన ప్రధాని మోదీ.. విగ్రహ ఆవిష్కరణకు తప్పక వస్తానని హామీ ఇచ్చారు.

మోదీకి ఆహ్వానం అందిస్తున్న చిన్నజీయర్ స్వామి
మోదీతో మాట్లాడుతున్న చిన్నజీయర్ స్వామి

కులవర్గ బంధనాలను తెంచి, భగవంతుడికి అందరూ సమానమే అంటూ భక్తులను భగవంతుడిని అనుసంధానం చేసిన ఆధ్యాత్మిక విప్లవమూర్తి భగవత్‌ శ్రీ రామానుజాచార్య. సమాజమంతటినీ ఏకం చేసిన సమతామూర్తి కొలువుదీరుతున్న నేపథ్యంలో శంషాబాద్‌ ముచ్చింతల్‌ ప్రాంతం ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా కొత్త రూపును సంతరించుకోనుంది. 216 అడుగుల ఎత్తుతో పంచలోహాలతో తీర్చిదిద్దిన శ్రీరామానుజాచార్య విగ్రహావిష్కరణ మహోత్సవానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, భారత ప్రధాన న్యాయమూర్తి.. ఇలా మహామహులంతా తరలి వస్తుండడం వల్ల పులకించిపోనుంది. రామానుజ ప్రాజెక్ట్‌ ఆవిష్కరణ మహోత్సవంతో ఫిబ్రవరి 2 నుంచి 14 వరకూ ఆధ్యాత్మిక శోభ వెల్లివిరయనుంది. విశ్వనగరంగా ఇప్పటికే పేరుపొందిన హైదరాబాద్‌కు ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు తేనుంది.

చిన్నజీయర్ స్వామి- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

రామానుజ మహాయజ్ఞం

ప్రపంచ శాంతి స్థాపనే ధ్యేయంగా, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులను నిర్వీర్యం చేసి, ప్రజలందరి మధ్య సత్సంబంధాలు వెల్లివిరిసేలా చేయడానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ చేపట్టిన ఈ రామానుజ మహాయజ్ఞం.. అందరి కళ్ల ముందు సాక్షాత్కరించనుంది. భక్తిభావం వెల్లి విరిసేలా... ప్రశాంత వందనంతో.. చూసిన వెంటనే శ్రీమతే నారాయణాయ నమః.. శ్రీమతే రామానుజాయ నమః అని అందరితో అనిపించేలా.. భగవత్‌ రామానుజాచార్య విగ్రహం ఆవిష్కృతం కానుంది.

రాష్ట్రపతికి అందిన ఆహ్వానం

గడిచిన ఐదు రోజులుగా దిల్లీలో పర్యటించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామి దేశ ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందించారు. దేశ అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను మంగళవారం కలిసిన చిన్నజీయర్‌ స్వామి.. సమతామూర్తి విగ్రహావిష్కరణకు ఆత్మీయంగా ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్ కోవింద్‌ను స్వయంగా కలిసి ఆహ్వానపత్రం అందించారు. రామానుజాచార్య విగ్రహ విశేషాలను, దాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణాలను రాష్ట్రపతికి వివరించారు చిన్నజీయర్‌ స్వామీజీ. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తప్పక హాజరవుతానని హామీ ఇచ్చారు రామ్‌నాథ్‌ కోవింద్‌.

ఉపరాష్ట్రపతికి ఆహ్వానపత్రిక

రాష్ట్రపతిని కలిసిన అనంతరం నేరుగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దగ్గరకు వెళ్లి రామానుజ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి ఆహ్వానించారు చిన్నజీయర్ స్వామి. కులమతవర్గ ఆర్థిక కారణాలతో సమాజం విచ్ఛిన్నమవుతున్న సమయంలో అందర్నీ ఏకం చేసేందుకే సమతామూర్తిని ఏర్పాటు చేసినట్లు వెంకయ్యనాయుడికి వివరించారు చిన్నజీయర్‌ స్వామి. సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపి సమానత్వ సాధన కోసం కృషిచేసిన భగవత్‌ రామానుజాచార్యులు సామాజిక సంస్కరణాభిలాషిగా చెరగని ముద్ర వేశారన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

తప్పక వస్తానన్న అమిత్​ షా

గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి.. భగవత్‌ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలకు రావాలని సాదరంగా ఆహ్వానించారు చిన్నజీయర్‌ స్వామి. రామానుజాచార్య జీవిత విశేషాలు.. ఆయన చేసిన మహత్కార్యాలను అమిత్‌ షాకు వివరించారు. ముచ్చింతల్‌లో చేపట్టిన రామానుజ ప్రాజెక్ట్‌ వివరాలను, కార్యక్రమ విశిష్టతను గంటపాటు అమిత్‌షాకు వివరించారు చినజీయర్‌స్వామి. దీన్నంతటినీ ఆసక్తిగా ఆలకించారు అమిత్‌ షా. విగ్రహావిష్కరణ మహోత్సవానికి తప్పకుండా వస్తానని చిన్నజీయర్‌ స్వామికి హామీ ఇచ్చారు అమిత్‌ షా.

రాజ్​నాథ్, గడ్కరీలకూ...

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు చిన్నజీయర్ స్వామి. భగవాన్‌‌ రామానుజుల విగ్రహావిష్కరణ మహోత్సవ విశేషాలను విని ఆనందం వ్యక్తం చేశారు రాజ్‌నాథ్‌ సింగ్‌. సమతామూర్తి విశిష్టతను, ప్రాజెక్టు పూర్తి వివరాలను అరగంటకుపైగా రాజ్‌నాథ్‌కు వివరించారు మైహోం గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ జూపల్లి రామేశ్వర్‌రావు. ఈ కార్యక్రమానికి హాజరవుతానని హామీ ఇచ్చారు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌.

బుధవారం కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి భగవత్‌ రామానుజాచార్య సమతామూర్తి ఆవిష్కరణ ఆహ్వాన పత్రాన్ని అందించారు చిన్నజీయర్ స్వామి. ఢిల్లీలో నితిన్‌ గడ్కరీని కలుసుకున్న చిన్నజీయర్‌ స్వామి.. సమతా మూర్తి విశిష్టతను వివరించారు.

కేంద్ర మంత్రులకు సైతం..

అటు కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌ రెడ్డిని కూడా దివ్యసాకేతానికి ఆహ్వానించారు చిన్నజీయర్ స్వామి. రామానుజ విగ్రహ ఆవిష్కరణ ఆహ్వాన పత్రాన్ని స్వయంగా అందించారు. సమతామూర్తి విగ్రహ ఏర్పాటు ద్వారా... వారి బోధనలు, సందేశం ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంటుందన్నారు చిన్నజీయర్ స్వామీజీ.

కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విన్‌ చూబెకు కూడా ఆహ్వాన పత్రికలు అందించారు చిన్నజీయర్ స్వామి. ఆశ్రమంలో నిర్మిస్తున్న సమతామూర్తి ప్రాధాన్యతను తెలియజేశారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజేను కూడా విగ్రహావిష్కరణ మహోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు చిన్నజీయర్‌ స్వామి.

కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌కూ సమతామూర్తి ఆవిష్కరణ మహోత్సవ ఆహ్వాన పత్రికను అందించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామీజి. శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి స్వయంగా ఆహ్వాన పత్రిక అందజేశారు. చిన్నజీయర్‌ స్వామీజీతో పాటు మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, మై హోం గ్రూప్ డైరెక్టర్లు జూపల్లి రంజిత్‌రావు, జూపల్లి రామూరావు భూపేంద్రయాదవ్‌ను కలిశారు. సమతామూర్తి ప్రాజెక్టు విశేషాలను స్వామీజీ కేంద్రమంత్రికి వివరించారు.

సీజేఐకి ఆహ్వానపత్రిక

సమతామూర్తి విగ్రహావిష్కరణకు హాజరుకావాలంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను శుక్రవారం స్వయంగా కలిసి ఆహ్వానపత్రికను అందించారు చిన్నజీయర్‌ స్వామీజి. సహస్రాబ్ది మహోత్సవాల విశిష్టతను చీఫ్‌ జస్టిస్‌కు వివరించారు స్వామీజీ. 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.

ఆరెస్సెస్, ఇతర హిందూ నేతలకు..

ఈ అద్వితీయ ఘట్టానికి విచ్చేయాలని ఆరెస్సెస్ చీఫ్‌ మోహన్‌భగవత్‌ను కలిసి ఆహ్వానించారు చినజీయర్‌ స్వామి. జీయర్‌ స్వామి చేపట్టిన ఈ మహాయజ్ఞాన్ని అభినందించారు మోహన్‌భగవత్‌. భగవత్‌ రామానుజుల ప్రాజెక్ట్‌ విశేషాలను ఆసక్తిగా ఆలకించారు.

విశ్వ హిందూ పరిషత్‌ ఉపాధ్యక్షులు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ని కూడా శ్రీరామానుజాచార్య పంచలోహ విగ్రహావిష్కరణకు ఆహ్వానించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి. ఢిల్లీలో చంపత్‌రాయ్‌ని స్వయంగా కలిసి స్వామీజీ.. ఆహ్వాన పత్రికను అందించారు. సమతామూర్తి లోకార్పణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. శ్రీ రామానుజాచార్య ప్రాజెక్టు గురించి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్న చంపత్‌రాయ్‌.. తప్పనిసరిగా వస్తానని మాట ఇచ్చారు.

ఆధ్యాత్మిక విప్లవమూర్తి భగవత్‌ రామానుజాచార్య

ఆలయాలు పాలనా కేంద్రాలుగా రాజ్యాలున్న సమయంలోనే ఏకవర్గ పాలనను పక్కనపెట్టి... 50 శాతం పాలనాధికారాలను సమాజంలోని అన్ని వర్గాలకు అనుగ్రహించిన సమతామూర్తి శ్రీరామానుజాచార్యస్వామి. 1017వ సంవత్సరంలో శ్రీ పెరుంబూదూరులో అవతరించారు స్వామి. సర్వజన హితానికై, సర్వజన సుఖానికై సర్వవేదసారమైన సూక్ష్మార్థాలను 9 గ్రంథాలుగా రచించారు. తన ఆధ్యాత్మిక జ్ఞానంతో గురువులను, పాలకులను, పండితులను, పామరులను మెప్పించి భక్తి బాటపై నడిపించారు.

అందరి దుఃఖాలు దూరం చేయడానికి నేనొక్కడినీ నరకానికైనా వెళ్లేందుకు ఆనందంగా అంగీకరిస్తానన్నారు రామానుజచార్యుల వారు. మాధవుని ముందు మనుష్యులందరూ సమానులేనని.. అతని నామాన్ని పలికే అధికారం అన్ని కులాలకీ ఉందని ఎలుగెత్తి చాటారు. అతన్ని ఆలయంలోకి ప్రవేశించే అర్హత కులాలకతీతంగా అందరిదీ అని ఆ కాలంలోనే సమతా సిద్ధాంతాన్ని ప్రకటించారు రామానుజచార్యుల వారు.

కులాలు, మతాలు, జాతులు, వర్గాలు, ఆస్తులు, అంతస్తుల పేరుతో మళ్లీ మనుషుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయని.. మళ్లీ ఆనాటి రామానుజుల అవసరం ఈనాటి సమాజానికి ఏర్పడిందన్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామిజీ. అందుకే ఈ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి అంకురార్పణ చేశారు.

శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం కార్యక్రమాలు

సమతామూర్తి విగ్రహప్రతిష్టాపన సందర్భంగా 1035 హోమ గుండాలతో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువును నిర్వహించనున్నారు. ఈ యాగం కోసం 2 లక్షల కిలోల ఆవు నెయ్యి వినియోగించనున్నారు. 108 దివ్యదేశ ప్రతిష్ట, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ట ఆ తర్వాత సమున్నత స్ఫూర్తి ప్రదాత సమతామూర్తిని లోకార్పణ చేయనున్నారు. నాలుగు వేదాలకు చెందిన 7 శాఖల పారాయణం, హవనం, 10 కోట్ల అష్టాక్షరీ మహామంత్ర జపము, వివిధ పురాణ, ఇతిహాస, ఆగమ గ్రంథముల పారాయణము జరగనున్నాయి. దీంతో పాటు ఆయా ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన శ్రీసాలగ్రామమూర్తి, దివ్యమృత్తికలను ఆయా సన్నిధులలో చేర్చి 108 దివ్యదేశాల ప్రాణప్రతిష్ట నిర్వహించనున్నారు.

సమతామూర్తి స్ఫూర్తికేంద్రం ప్రత్యేకతలు

అనేక విశిష్టలతో నిర్మితమవుతున్న సమతాస్ఫూర్తి కేంద్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. వెయ్యి కోట్లతో మొత్తం 200 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఈ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న స్టాట్చ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీని 216 ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో రామానుజాచార్యలు విగ్రహాన్ని108 ఫీట్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. భద్రవేది ఎత్తు 54 ఫీట్లు, పద్మపీఠం 27 ఫీట్లు, త్రిదండం 135 ఫీట్ల ఎత్తులో నిర్మిస్తున్నారు.

ఇక భద్రవేదిలో 54 పద్మాలను ఏర్పాటు చేశారు.. స్టాట్చ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ పద్మం కింద 36 ఏనుగులను ఏర్పాటు చేశారు. 18 శంఖు, 18 చక్రాలతో మొత్తం 36 శంకుచక్రాలను ఏర్పాటు చేశారు. ఇక రామానుజాచార్యుల జీవిత చరిత్రను తెలిపే గ్యాలరీ, వేదాల సారాన్ని అందించే గ్రంథాల లైబ్రరీ, పండిత సభల కోసం ఆడిటోరియం, వివిధ ప్రదర్శనల కోసం ఓమ్నిమాక్స్‌ థియేటర్‌ను కూడా నిర్మిస్తున్నారు..

అంత పెద్ద రామానుజచార్యుల విగ్రహానికి అభిషేకం నిర్వహించడం కష్టతరం కాబట్టి ప్రత్యేకంగా బంగారంతో రూపొందించిన రామానుజచార్యుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. 120 కేజీల బంగారంతో దీనిని తీర్చిదిద్దారు.

స్ఫూర్తి కేంద్రం విశిష్టతలు

  • 216 అడుగుల పంచలోహ విగ్రహాం
  • 1800 టన్నుల పంచలోహాల వినియోగం
  • మొత్తం 200 ఎకరాల్లో నిర్మాణం
  • రూ.వెయ్యి కోట్లతో సమతామూర్తి ప్రాజెక్టు నిర్మాణం
  • స్టాచూ ఆఫ్‌ ఈక్వాలిటీ ఎత్తు 216 అడుగులు
  • రామానుజ విగ్రహం ఎత్తు 108 అడుగులు
  • భద్రవేది ఎత్తు 54 అడుగులు
  • పద్మపీఠం ఎత్తు 27 అడుగులు
  • త్రిదండం ఎత్తు 135 అడుగులు
  • భద్రవేదిలో ఏర్పాటు చేసిన పద్మాల సంఖ్య 54
  • పద్మం కింద ఏర్పాటు చేసిన ఏనుగుల సంఖ్య 36
  • శంఖు చక్రాల సంఖ్య 18+18 = 36
  • రామానుజాచార్యుల జీవిత చరిత్రను తెలిపే గ్యాలరీ
  • వేదాల సారాన్ని అందించే గ్రంథాల లైబ్రరీ
  • పండిత సభల కోసం ఆడిటోరియం
  • వివిధ ప్రదర్శనల కోసం ఓమ్నిమాక్స్‌ థియేటర్‌
  • భద్రపీఠం లోపల 120 కేజీల బంగారంతో చేసిన రామానుజచార్య విగ్రహం
  • రామానుజచార్యులకు అభిషేకం నిర్వహించేలా ఏర్పాటు చేసిన మ్యూజికల్‌ ఫౌంటేన్

సహస్రాబ్ది సమరోహంలో కార్యక్రమాలు

  • 1035 హోమ గుండాలతో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు
  • 108 దివ్య దేశ ప్రతిష్ట, కుంభాభిషేకం
  • స్వర్ణమయ రామానుజాచార్య విగ్రహ ప్రతిష్టాపన
  • హోమంలో 2 లక్షల కిలోల ఆవు నెయ్యి వినియోగించనున్నారు
  • మహాక్రతువును నడిపించననున్న 5000 మంది రుత్విక్కులు
  • 216 అడుగుల సమతామూర్తి ఆవిష్కరణ
Last Updated : Sep 18, 2021, 11:16 PM IST

ABOUT THE AUTHOR

...view details