చైనా మరో కుటిలయత్నానికి తెరతీసింది. వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక కార్యకలాపాల కోసం టిబెట్ యువతను తన సైన్యంలో చేర్చుకుంటోంది. భారత సరిహద్దుల్లో సైనిక కార్యకలాపాల కోసం చైనా.. టిబెట్ యువతను సైన్యంలోకి తీసుకుని వారికి శిక్షణ అందిస్తోందన్న సమాచారం భారత నిఘా వర్గాలకు అందింది. ఈ ఏడాది ఆరంభం నుంచి టిబెట్ యువతను సైన్యంలో చేర్చుకునే ప్రక్రియను చైనా ప్రారంభించినట్లు తెలుస్తోంది.
గతేడాది లద్ధాక్‌లో జరిగిన ఘర్షణల సందర్భంగా భారత సైన్యానికి చెందిన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్.. డ్రాగన్ సేనలను సమర్థంగా నిలువరించింది. దీంతో ఈ దళంలో ఉన్న టిబెటియన్ల శక్తి సామర్థ్యాలను గుర్తించిన చైనా.. ఈ కుటిలయత్నానికి తెరతీసింది. టిబెట్ యువతను సైన్యంలో చేర్చుకుని వారినే భారత సరిహద్దుల్లో మోహరించాలని కుట్రలు చేస్తోంది. సైన్యంలో చేర్చుకునే టిబెటియన్ యువతలో చైనా పట్ల రాజభక్తిని పెంపొందించేలా అనేక రకాల తర్ఫీదులు ఇస్తున్నట్లు సమాచారం. చైనీస్ భాషను నేర్పించడం, చైనా కమ్యూనిస్ట్ పార్టీ సర్వాధికారాన్ని అంగీకరించడం వారికి అలవాటు చేస్తోంది. దలైలామా సహా ఇతర మత గురువులు బోధించే విశ్వాసాల కంటే చైనా సర్వాధికారమే అత్యున్నతమని భావించేలా చైనా వారికి శిక్షణ ఇస్తోంది.