'తూర్పు లద్దాఖ్లోనిగల్వాన్ లోయలో గతేడాది తలెత్తిన ఘర్షణలకు కారణం భారత్' అని చైనా(china on india) చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి. చైనా(china on india latest).. రెచ్చగొట్టే ప్రవర్తన వల్లే లద్దాఖ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొందని తెలిపారు. చైనా ప్రవర్తించిన తీరువల్లే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయని వ్యాఖ్యానించారు.
తొలుత.. గల్వాన్ ఘటనకు కారణం 'చైనా భూభాగంలోకి భారత్ ప్రవేశించడమే' అని చైనా విదేశాంగ ప్రతినిధి మీడియా సమావేశంలో ఆరోపించారు. భారత్ అన్ని ఒప్పందాలను ఉల్లంఘించిందని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలను తిప్పికొట్టింది భారత్. "ఇవి తప్పుడు ఆరోపణలు. వీటిని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. గతేడాది లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చోటు చేసుకున్న ఉద్రిక్తతలకు కారణం చైనా దురుసుతనమే. యథాతథస్థితికి భంగం కలిగించేందుకు చైనా పలుమార్లు ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలను ఉల్లంఘించింది" అని అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. ఇటీవలే ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు జరిగిన నేపథ్యంలో చైనా.. ఇతర సమస్యలను కూడా పరిష్కరించుకునే దిశగా అడుగులేస్తుందని భావించినట్లు బాగ్చి తెలిపారు.