భారత్, చైనా సీనియర్ సైన్యాధికారుల మధ్య 13వ విడత సరిహద్దు చర్చలు విఫలమైన అనంతరం.. మన దేశాన్ని చక్రబంధంలో ఇరికించడానికి బీజింగ్ చేస్తున్న కుట్రలు స్పష్టంగా వెలుగులోకి వస్తున్నాయి. మన పొరుగు దేశాల్లో ప్రాబల్యం పెంచుకోవడానికి డ్రాగన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనికి తాజా ఉదాహరణ భూటాన్‌తో శుక్రవారం కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం (ఎంఓయు). రెండు దేశాల మధ్య అపరిష్కృత వివాదాల పరిష్కారానికి చైనా మూడు అంచెల ఒప్పందాన్ని ప్రతిపాదించగా దీనికి భూటాన్ అంగీకారం తెలిపింది. చైనా, భూటాన్ మధ్య 37 ఏళ్ల నుంచి నలుగుతున్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ ఒప్పందం తోడ్పడుతుంది. భూటాన్ కనుక చైనా బెల్ట్ అండ్ రోడ్ పథకం (బీఆర్‌ఐ)లో చేరితే అది భారత్‌కు ఆందోళనకరమే. చైనా కమ్యూనిస్టు పార్టీ వాణిని ప్రతిబింబించే గ్లోబల్ టైమ్స్ పత్రిక అలాంటి ప్రమాదాన్ని సూచించింది. చైనా-భూటాన్ మూడు అంచెల ఒప్పందం బీఆర్‌ఐ పథకానికీ, చైనా సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికీ ఎంతో తోడ్పడుతుందని గ్లోబల్ టైమ్స్ ఉద్ఘాటించడం గమనార్హం. భూటాన్‌తో కుదిరే ఒప్పందం వల్ల చైనాకు మన సరిహద్దులోని కీలక శిలిగుడి కారిడార్‌పై డేగ కన్ను వేయడానికి అవకాశం చిక్కుతుంది. చికెన్స్‌నెక్‌గా వ్యవహరించే ఈ కారిడార్ భారత్ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య భారతంతో కలిపే అత్యంత కీలక ప్రాంతం. భారత్‌కు తెలియకుండా భూటాన్ చైనాతో సాగిస్తున్న రహస్య మంతనాల ఫలితమే మూడంచెల ఒప్పందం.
పాక్‌కు చైనా క్షిపణులు