తూర్పు లద్దాఖ్‌లో ప్రతిష్టంభనను తొలగించే దిశగా ముందడుగు అయితే పడింది. కానీ మన దేశ భూభాగంలోకి చొచ్చుకొచ్చి, తిరిగి వెళ్లేందుకు మొండికేసిన చైనా.. అకస్మాత్తుగా బలగాల ఉపసంహరణ చేపడుతున్నట్లు ప్రకటించడం, గల్వాన్ ఘర్షణలో తమ సైనికులు మరణించారని అంగీకరించడం ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. అయితే ఇవన్నీ చైనా ఎత్తులేనని నిపుణులు చెబుతున్నారు. తమ పౌరుల్లో దేశభక్తి, జాతీయవాద భావనను పెంచడానికి మృతుల విషయాన్ని అంగీకరించిందని అంటున్నారు.
ఇదీ చదవండి:భారత్ 'మాస్టర్ స్ట్రోక్' వల్లే తోకముడిచిన డ్రాగన్!
ఈ విషయంపై జేఎన్‌యూ చైనా స్టడీస్ విభాగ ప్రొఫెసర్ శ్రీకాంత్ కొండపల్లి 'ఈటీవీ భారత్'కు ప్రత్యేకఇంటర్వ్యూ ఇచ్చారు. మృతుల గురించి చైనా చేసిన ప్రకటన ఆశ్చర్యకరమని ఆయన పేర్కొన్నారు. నలుగురు మృతి చెందినట్లు ప్రకటించగా.. అందులో ఒకరి(చెన్ షియాంగ్రోంగ్) సమాధి గతేడాది వెలుగులోకి వచ్చిందని గుర్తు చేశారు. 45 మంది చైనా సైనికులు మృతి చెందారన్న రష్యా నిఘా సంస్థ నివేదికను ప్రస్తావించారు.
"ఈ అంశాలన్నీ చూస్తే ఆశ్చర్యకరంగా ఉన్నాయి. పాంగాంగ్ సమీపంలోని ఫింగర్ 8-ఫింగర్ 4 మధ్య భూభాగాన్ని ఖాళీ చేయడం వెనక వేరే ఉద్దేశం ఉన్నట్లు కనిపిస్తోంది. నలుగురు జవాన్ల ప్రాణత్యాగం భవిష్యత్తులో వృథా కానివ్వమని తమ ప్రజలకు హామీ ఇవ్వాలనుకుంటోంది. రెండో విషయం.. ఈ(సైనికుల మృతికి సంబంధించిన) సమాచారాన్ని బహిర్గతం చేసి ప్రజల్లో దేశ భక్తి, జాతీయవాద భావనను పెంచాలనుకుంటోంది. మూడోది.. భారతదేశ శక్తిసామర్థ్యాలను పరిగణలో ఉంచుకొని వాస్తవాధీన రేఖ వెంబడి మరోసారి దుస్సాహసాలకు పాల్పడబోమని సంకేతాలు ఇస్తోంది."
-ప్రొఫెసర్ శ్రీకాంత్ కొండపల్లి